Manish Sisodia: మనీశ్ సిసోదియాకు బెయిల్‌ మంజూరు

17 నెలల తర్వాత బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు;

Update: 2024-08-09 06:30 GMT

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ నేత మనీశ్ సిసోదియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్‌  మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని కోర్టు  ఆదేశించింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. సిసోదియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది.

ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసు లో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్‌ సిసోదియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అరెస్టయిన రెండు రోజుల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి గత 17 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్‌ కోరుతూ ఆ మధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ బి.ఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కె.వి. విశ్వనాథన్‌ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరు. కేసు విచారణలో పురోగతి లేకపోయినా.. ఒక పరిమితి దాటిన తర్వాత ఆ వ్యక్తిని జైల్లో ఉంచడం సరికాదు. అలాకాదంటే ఆ వ్యక్తి హక్కులను హరించడమే అవుతుంది. బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడం, ఉపశమనం పొందడం వారి హక్కు. ‘బెయిల్‌ అనేది నియమం.. జైలు మినహాయింపు’ అనే విషయాన్ని ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సిసోదియాకు బెయిల్ మంజూరవడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీనేతలు హర్షం వ్యక్తంచేశారు. ‘‘ఈ రోజు దేశమంతా ఆనందంగా ఉంది. గత 530 రోజులుగా సిసోదియాను జైల్లో పెట్టారు. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే ఆయన చేసిన నేరమా?’’ అని ఎంపీ రాఘవ్‌ చద్దా కేంద్రంపై మండిపడ్డారు.

‘‘సిసోదియా జీవితంలో 17 నెలలు జైల్లోనే నాశనమయ్యాయి. ఈ రోజు నిజం గెలిచింది. ఈ తీర్పు నియంతృత్వానికి చెంపదెబ్బ. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, సత్యేందర్‌ జైన్‌కు కూడా త్వరలోనే న్యాయం జరిగి జైలు నుంచి విడుదలవుతారని ఆశిస్తున్నాం’’ అని మరో ఎంపీ సంజయ్‌సింగ్‌ ధీమా వ్యక్తంచేశారు.

Tags:    

Similar News