Kolkata murder case: 50 మంది సీనియర్ వైద్యుల రాజీనామా..
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక పరిణామం;
కోల్‌కతాలోని ఆర్జీఆర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా జూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతుగా ఆర్జీకర్ ఆసుపత్రికి చెందిన 50 మంది సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు మంగళవారం మూకుమ్మడి రాజీనామా చేశారు.
కోల్‌కతా వైద్యురాలి అత్యాచార ఘటన మరోసారి ఉధృతం అవుతోంది. ఆగస్టు 9న ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇక ఆమెకు మద్దతుగా జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనలు చేపడుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలు తాజాగా మరింత తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరాహార దీక్షకు సీనియర్ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు కూడా మద్దతు ప్రకటించారు. మంగళవారం ఉదయం 15 మంది సీనియర్ వైద్యులు జూడాల నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించగా.. తాజాగా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోని 50 మంది సీనియర్ వైద్యులు, బోధనా సిబ్బంది మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆగస్టు 9న వైద్యురాలు హత్యాచారానికి గురైన తర్వాత కోల్‌కతాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిరసనకారులు.. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అయినా తమ భద్రత విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సానుకూల చర్యలు తీసుకోలేదంటూ జూనియర్ వైద్యులు నిరవిధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. తాజాగా వీరికి మద్దతుగా సీనియర్ వైద్యులు కూడా సంఘీభావం తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరోసారి ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఇదిలా ఉంటే వైద్యుల నిరసనలు కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా పండుగ నేపథ్యంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇదిలా ఉంటే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సంజయ్ రాయ్ ఒక్కడినే నిందితుడిగా చూపించింది. అధికారులు పలువురిని విచారించినా.. ఎవరినీ నిందితులకు చేర్చలేదు.