Kantilal Bhuria : ఇద్దరు భార్యలుంటే రెండు లక్షలు
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత అడ్డగోలు హామీలు;
ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ మ్యానిఫెస్టోలను విడుదల చేయటం సహజం. ప్రజలకు కావాల్సిన వసతులు సమకూర్చే విధంగా వారిని ఆకట్టుకునే విధంగా పథకాలు రూపొందిస్తారు. ఆయా ప్రార్టీలు ప్రకటించిన పథకాలను ప్రజలు పరిగణలోకి తీసుకుని ఓటు వేయాలా.. వద్దా.. అన్నది గమనిస్తారు. కాంగ్రెస్ హామీలు శృతి మించుతున్నాయి. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా హస్తం పార్టీ నోటికొచ్చిన హామీలన్నీ ఇస్తున్నది. కాగా.. ఇటీవల ఓ కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన హామీ ఆసక్తిగా మారింది. అదేంటంటే..’ఇద్దరు భార్యలు ఉన్నవారికి ₹ 2 లక్షలు ఇస్తాం’ అని కాంగ్రెస్ నాయకుడు కాంతిలాల్ భూరియా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆయన ప్రకటనకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ కూడా మద్దతు తెలపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భూరియా మధ్యప్రదేశ్‌లోని రత్లాం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఒక ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ‘మహాలక్ష్మి యోజన’ పథకం గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తానని హామీ ఇచ్చింది. కాగా.. భూరియా ఈ పథకంలో భాగంగా మరో కొత్త అంశాన్ని చెప్పారు. ఒక భార్య ఉంటే.. రూ. లక్ష, ఇద్దరు భార్యలు ఉన్న వారికి రూ.2 లక్షలు అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ కూడా మద్దతు తెలపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నగదు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ ప్రకటనపై అధికార భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపీఏ) ప్రభుత్వంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన కాంతిలాల్ భూరియా పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. సైలానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో భూరియా ప్రకటనను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది.
కర్ణాటకలో ప్రతి మహిళకు రూ.2 వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇదేదో బాగుందే అని తెలంగాణలో రూ.2,500 ఇస్తామని చెప్పి గెలిచి 5 నెలలుగా అవుతున్నది. అయినా ఇంతవరకు అమలు చేయలేదు. ఇప్పుడు ఇదే ఫార్ములాను దేశమంతా ఫాలో అవుతున్నది కాంగ్రెస్.