Millionaire thief :పేరుకే దొంగ.. ఆస్తులు చూస్తే ..
నేపాల్లో హోటల్ , యూపీ లో గెస్ట్ హౌస్, లక్నోలో ఇల్లు;
ఢిల్లీ పోలీసులు చోరీలు చేస్తూ కోట్లకు పడగలెత్తిన ఒక దొంగను పట్టుకున్నారు. ఇతను పోలీసుల కన్నుగప్పి దొంగతనాలు చేస్తూ ఢిల్లీ మొదలుకొని నేపాల్ వరకూ పలు ఆస్తులను కూడబెట్టాడు. ఢిల్లీలో ఒంటరిగా 200కు పైగా దొంగతనాలు చేశాడు. తొమ్మిదిసార్లు వివిధ పేర్లతో అరెస్టు చేశారు అయితే ఇప్పటి వరకు అతని కుటుంబ సభ్యుల వివరాలు మాత్రం సంపాదించలేకపోయారు.
వివరాలలోకి వెళితే..
కొద్ది రోజుల క్రితం మోడల్ టౌన్ పోలీసులు ఒక ఇంటిలో చోరీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను కోటీశ్వరుడైన ఒక హోటల్ వ్యాపారిని మనోజ్‌చౌబేగా గుర్తించారు. అతను గడచిన 25 ఏళ్లుగా ఒంటరిగా ఉంటూ కుటుంబ వివరాలు ఎవరికీ చెప్పకుండా బతుకుతున్నాడు. తన భార్య పేరుతో సిద్ధార్థనగర్‌లో గెస్ట్‌హౌస్, తన పేరుతో నేపాల్‌లో ఒక హోటల్ కొనుగోలు చేశాడు. అలాగే లక్నో, ఢిల్లీలలోనూ సొంతంగా ఇళ్లు ఉన్నాయి. 2001 నుంచి 2023 వరకూ ఇతనిపై 15కు పైగా నేరపూరిత కేసులు నమోదయ్యాయి.
ఒకప్పుడు మనోజ్ చౌబే కుటుంబం యూపీలోని సిద్దార్థనగర్‌లో ఉండేది. తరువాత వారు నేపాల్‌కు తరలివెళ్లారు. 1997లో మనోజ్ ఢిల్లీ వచ్చాడు. కీర్తినగర్ పోలీస్‌స్టేషన్‌లో సొంతంగా ఓ క్యాంటీన్ నిర్వహించాడు. చుట్టుపక్కల క్యాంటీన్‌లలో చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతనిని జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చాక ఈసారి ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలు మొదలుపెట్టాడు. డబ్బు పోగేశాక అది తీసుకొని గ్రామానికి వెళ్లిపోతుండేవాడు.
తర్వాత కొంతకాలానికి ఒక అద్దె ఇంట్లో ఉంటూ దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ చోరీ సొమ్ముతో మనోజ్ నేపాల్‌లో హోటల్ నిర్మించాడు. ఈ సమయంలోనే ఢిల్లీలో పార్కింగ్ కంట్రాక్టు పనులు చేస్తుంటానని చెప్పి యూపీలోని ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కంట్రాక్టు పనుల కోసం తాను ఆరు నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్లవలసి ఉంటుందని నమ్మబలికాడు. అలా చక్కగా మేనేజ్ చేస్తూ భార్య పేరుతో ఒక గెస్ట్ హౌస్ నిర్మించాడు. ఒక ల్యాండ్ ను ఆసుపత్రి స్థలానికి లీజ్ కి ఇచ్చిన నెలకు రెండు లక్షలు అద్దెగా సంపాదిస్తున్నాడు. ఇది కాక అతనికి లక్నోలో మరో ఇల్లుంది.. అయితే ఇన్ని ఉన్నా అప్పుడప్పుడు ఢిల్లీ వచ్చి చిన్న దొంగతనం అయినా చెయ్యకపోతే అతనికి కుదరదు. అసలు సాక్షాలు దొరకకుండా చేయటం, ఒకవేళ పట్టుబడినా, అసలైన వివరాలు చెప్పకుండా ఉండటం, రికవరీ చేయడానికి డబ్బులు చేతిలో పెట్టుకోకపోవడం లాంటి కారణాలతో అతను ఎప్పుడూ సరైన శిక్ష అనుభవించలేదు.
ఇప్పుడు కూడా మనోజ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి లక్ష రూపాయలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.