CM ATTACK: మేఘాలయ సీఎం కార్యాలయంపై దాడి
ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించిన ఆందోళనకారులు.. రాళ్ల దాడి.. అయిదుగురికి తీవ్రగాయాలు;
మేఘాలయ(Meghalaya) సీఎం కన్రాడ్ సంగ్మా(Conrad Sangma) కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు ఆందోళనకారులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని(Meghalaya Chief Minister) ముట్టడించారు. నిరసనకారుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. సీఎం కన్రాడ్ సంగ్మా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. వందలాది మంది ఆందోళనకారులు రోడ్డును బ్లాక్ చేయడంతో ముఖ్యమంత్రితో పాటు ఓ మంత్రి కూడా సీఎం కార్యాలయం(Chief Minister's office)లోనే ఉండిపోయారు.
తురాలో శీతాకాల రాజధాని( winter capital ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గారో హిల్స్‌కు చెందిన పౌర సమాజ సంఘాలు నిరాహార దీక్ష(hunger strike ) చేపట్టాయి. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయం వెలుపల వందలాది మంది గుమిగూడారు. ఆ సమయంలో కొందరు సీఎం కార్యాలయంపై రాళ్లు రువ్వడంతో ఘర్షణ మొదలైంది. ఈ దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది(5 Injured In Attack Mob attack)కి గాయాలు కావడంతో వారిని సీఎం కార్యాలయంలోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ.. ఉద్రిక్తంగా ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ హింసాత్మక ఘటనకు ముందు దాదాపు మూడు గంటలపాటు సీఎం సంగ్మా రాజధాని ఏర్పాటు అంశంపై పౌర సంఘాల ప్రతినిధులతో శాంతియుతంగా చర్చిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, రాళ్లు రువ్విన వ్యక్తులు పౌరసంఘాలతో సంబంధంలేని వారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 8 లేదా 9 తేదీల్లో షిల్లాంగ్‌లో చర్చలకు రావాలని పౌరసంఘాల ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు.