Manipur: మణిపూర్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ఎత్తివేత..

23 రోజుల తర్వాత పునఃప్రారంభం..;

Update: 2024-12-10 03:15 GMT

మణిపూర్‌  లోని తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్‌ పై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. శాంతి భద్రతల పరిస్థితి, ఇంటర్నెట్ సేవలతో దాని పరస్పర సంబంధాన్ని సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నెట్, డేటా సేవలపై ఉన్న తాత్కాలిక సస్పెన్షన్‌లను తక్షణమే ఎత్తివేయాలని తెలిపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఇంటర్నెట్ వినియోగదారులందరినీ హెచ్చరించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తితే భవిష్యత్తులో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇంటర్నెట్ ఎత్తివేసిన వాటిలో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, జిరిబామ్, చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పి, ఫెర్జావాల్ జిల్లాలు ఉన్నాయి.

అయితే, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, విద్యా సంస్థలతో పాటు వివిధ కార్యాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని మణిపూర్ ప్రభుత్వం నవంబర్ 19 (2024)న బ్రాడ్‌బ్యాండ్ సేవలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది . అయితే, Wi-Fi లేదా హాట్‌స్పాట్‌ల కనెక్షన్స్ కు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. కాగా, భవిష్యత్తులో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపి వేసే అవకాశం ఉన్నప్పటికి.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు ఇంటర్నెట్ వినియోగదారులందరూ దూరంగా ఉండాలని రాష్ట్ర హోం శాఖ తెలిపింది.

ఇక, జిరిబామ్‌లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లల మృతదేహాలను వెలికితీయడంతో పాటు ఇంఫాల్ లోయలో హింస చోటు చేసుకోవడంతో.. ఎమ్మెల్యేల ఇళ్ళు, ఇతర ఆస్తులపై అనేక మంది నిరసనకారులు దాడి చేయడంతో తొమ్మిది జిల్లాల్లో నవంబర్ 16న ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అయితే, మణిపూర్‌లో గత సంవత్సరం మే నుంచి మైటీలు, కుకీల మధ్య జాతి హింసలో 250 మందికి పైగా మరణించారు.. అలాగే, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.


Tags:    

Similar News