One Nation One Election : జమిలి ఎన్నికలపై చర్చ భారత ప్రజాస్వామ్యానికి చాలా కీలకం: ప్రధాని

ఎన్‌సీసీ ర్యాలీలో ప్రధాని మోదీ పిలుపు

Update: 2025-01-28 01:25 GMT

'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ప్రతిపాదనపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ భారతదేశ ప్రజాస్వామిక ప్రక్రియకు చాలా ముఖ్యమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈ అంశంపై చర్చలో భాగస్వాములు కావడం సహా, ఈ చర్చను ప్రోత్సహించాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. సోమవారం దిల్లీలో నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల ప్రతిపాదనపై చర్చను ప్రోత్సహించడం సహా, దానిలో పాల్గొనాలని ఎన్‌సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ఆయన సూచించారు. ఇది నేరుగా వారి భవిష్యత్తులతో ముడిపడిన అంశమని మోదీ చెప్పారు. "మన దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా మారిపోయింది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక చాలా ఏళ్లపాటు జమిలి ఎన్నికలే జరిగాయి. కొన్ని కారణాల వల్ల ఈ విధానం అమలుకు ఆకస్మిక అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో రాష్ట్రాల స్థాయిలో, జాతీయ స్థాయిలో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది దేశానికి పెద్ద సవాల్‌గా మారింది" అని ప్రధాని వివరించారు.

పదేపదే ఎన్నికలు జరుగుతుంటే?

"దేశంలో పదేపదే ఎన్నికలు జరుగుతుంటే పాలనా వ్యవస్థలకు విఘాతం కలుగుతుంది. వికాసం మందగిస్తుంది. జమిలి ఎన్నికల విధానంతో ఈ సమస్యలన్నీ సమసిపోతాయి. పాలనా వ్యవస్థ అవాంతరాలు లేకుండా పనిచేయగలదు. ప్రభుత్వం మరింత ఫోకస్డ్‌గా పాలనలో ముందుకు సాగగలదు" అని మోదీ తెలిపారు. "అమెరికాలాంటి దేశాల్లోనూ ప్రతి నాలుగేళ్లకోసారి జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. నూతన ప్రభుత్వాల ఏర్పాటు తేదీలను సైతం అక్కడి రాజ్యాంగంలో ఫిక్స్‌డ్‌గా పొందుపరిచారు" అని మోదీ చెప్పారు.

భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాలంటే?

"జమిలి ఎన్నికలతో ముడిపడిన అంశాలపై ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీలో ఉన్నవాళ్లంతా లోతుగా చర్చించండి. భారతదేశ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాలంటే మీరంతా చర్చించుకోవడం చాలా అవసరం" అని ప్రధాని పేర్కొన్నారు. "1 లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలని నేను ఎర్రకోట నుంచి పిలుపునిచ్చాను. కొత్తకొత్త ఆలోచనలు కలిగిన యువతకు రాజకీయాల్లో చోటు ఉంటుంది. యువత లేకుండా ప్రపంచ భవిష్యత్తును మనం ఊహించుకోలేం. ప్రపంచ హితాన్ని కోరే గొప్ప శక్తి యువతే" అని మోదీ పేర్కొన్నారు. "2014 నాటికి భారత్‌లో 14 లక్షల మంది ఎన్‌సీసీ కేడెట్లు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 20 లక్షలకు చేరింది. ఇందులో దాదాపు 8 లక్షల మంది బాలికలే" అని ప్రధాని అన్నారు.

Tags:    

Similar News