Narendra Modi: ఢిల్లీ పేలుడు ఘటనపై నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు..
మనసు కలిచి వేసిందన్న ప్రధాని, బాధ్యుల్ని ఎవర్ని కూడా వదిలేదే లేదని వార్నింగ్
ఢిల్లీ బ్లాస్ట్‌పై ప్రధాని మోడీ తొలిసారి స్పందించారు. ఢిల్లీ పేలుడు మనసు కలిచి వేసిందన్నారు. భూటాన్ పర్యటనలో ఉన్న మోడీ.. ఢిల్లీ పేలుడుపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చాలా బాధాకరమైన హృదయంతో భూటాన్ వచ్చాను. బాధితుల దు:ఖాన్ని అర్థం చేసుకున్నాం. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం. ఢిల్లీ బాంబ్ పేలుడు సూత్రధారులను విడిచిపెట్టబోం. కుట్రదారులను చట్టం ముందు నిలబెడతాం. ఇప్పటికే ఉగ్ర కుట్ర మూలాలను గుర్తించాం. ఢిల్లీ ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాం. పేలుడుపై అర్ధరాత్రి వరకు సమీక్షలు చేస్తూనే ఉన్నాం. బాధితుల వెంట దేశమంతా ఉంది.’’ అని మోడీ తెలిపారు.
రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ మంగళవారం ఉదయం భూటాన్ వెళ్లారు. పర్యటన ముగించుకుని బుధవారం ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం రేపు సాయంత్రం 5:30 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మంగళవారం కీలక సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ ప్రారంభమైంది. హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ డీజీపీ, కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఢిల్లీ పేలుడిపై ప్రాథమికంగా అందిన సమాచారం, ఉగ్ర సంస్థల ప్రమేయం, భారీ కుట్రపై సమీక్షిస్తున్నారు.
సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలం దగ్గర పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇక నిందితుడికి సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి.