Uttar Pradesh: క్యాష్‌ బ్యాగ్‌ ఎత్తుకెళ్లి, నోట్లు వెదజల్లిన కోతి..

ఉపాధ్యాయుడికి తీవ్ర వేదన!;

Update: 2025-08-28 01:30 GMT

ఉత్తరప్రదేశ్‌లోని ఓ తహసీల్దార్ కార్యాలయంలో ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురిసింది. అయితే అది మేఘాల నుంచి కాదు, ఓ కోతి చేతి నుంచి! ఈ ఊహించని వింత ఘటనతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. కొందరు పండగ చేసుకోగా, డబ్బు పోగొట్టుకున్న బాధితుడు మాత్రం లబోదిబోమన్నాడు.

వివరాల్లోకి వెళితే, ఔరైయా జిల్లా దోడాపూర్ గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు, రిజిస్ట్రేషన్ పని మీద బిధున తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. తన వెంట బ్యాగులో రూ.80,000 నగదు తెచ్చుకున్నాడు. కార్యాలయంలో ఉండగా, ఎక్కడినుంచి వచ్చిందో ఓ కోతి రెప్పపాటులో అతడి బ్యాగులోని రూ.500 నోట్ల కట్టను లాక్కొని పరుగు లంకించుకుంది.

అక్కడి నుంచి నేరుగా సమీపంలోని ఓ చెట్టుపైకి ఎక్కిన ఆ వానరం, కాసేపటికి నోట్ల కట్టను విప్పి ఒక్కొక్క నోటును కిందకు విసరడం మొదలుపెట్టింది. చెట్టు పైనుంచి రూ.500 నోట్లు రాలడం చూసిన జనం ఆశ్చర్యపోయారు. వెంటనే తేరుకుని, అక్కడికి గుమిగూడి దొరికిన నోట్లను దొరికినట్టు ఏరుకోవడం ప్రారంభించారు. ఈ గందరగోళంలో, డబ్బు పోగొట్టుకున్న ఉపాధ్యాయుడు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. తన డబ్బును తిరిగి ఇవ్వమని జనాన్ని బ్రతిమాలాడు.

కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందరూ కలిసి ఏరిన డబ్బును లెక్క చూడగా, అతనికి రూ.52,000 మాత్రమే తిరిగి దక్కాయి. మిగిలిన రూ.28,000 అక్కడున్న వారు జేబుల్లో వేసుకుని వెళ్లిపోయారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ ప్రాంతంలో కోతుల బెడద చాలా తీవ్రంగా ఉందని, గతంలో కూడా ఇలా విలువైన వస్తువులు, పత్రాలు లాక్కెళ్లిన ఘటనలు ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News