ఒక తల్లి దారుణానికి పాల్పడింది. నలుగురు పిల్లలను నదిలో ముంచింది.ఇద్దరు కుమారులు మరణించగా ఒక పిల్లవాడు అదృశ్యమయ్యాడు. మరో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే పిల్లలు ఆకలితో ఏడ్వడాన్ని చూడలేకనే వారిని నదిలో ముంచి చంపినట్లు ఆ మహిళ పోలీసులకు చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బరావా గ్రామానికి చెందిన ప్రియాంకకు నలుగురు పిల్లలు. ఏడాదిన్నర కిందట ఆమె భర్త చనిపోయాడు. నాటి నుంచి బంధువు ఇంట్లో ఆమె నివసిస్తున్నది. కాగా, గురువారం ఉదయం ప్రియాంక తన నలుగురు పిల్లలను కేశంపూర్ ఘాట్ వద్దకు తీసుకెళ్లింది. బాంబా నదిలో వారిని ముంచింది. నాలుగు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు. ఏడాదిన్నర వయస్సున్న చిన్నారి కనిపించడం లేదు. అయితే ఆరేళ్ల వయస్సున్న పెద్ద పిల్లవాడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ ఘాట్ వద్దకు చేరుకున్నారు. నదిలో మునిగి మరణించిన ఇద్దరు పిల్లల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రియాంకను అరెస్ట్ చేశారు. ఆమెను ప్రశ్నించగా పిల్లలను తానే చంపినట్లు ఒప్పుకున్నది. వారు ఆకలితో ఏడుస్తుంటే తట్టుకోలేక ఇలా చేసినట్లు చెప్పింది. ఇది విన్న పోలీసులు షాక్ అయ్యారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.