Mumbai: ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ. 16 లక్షల విలువైన బంగారు నగల బ్యాగ్‌ను..

గ్రాము బంగారం ధర వేలల్లో పలుకుతోంది. అయినా అతడు ఆశ పడలేదు.. కష్ట పడకుండా వచ్చిన సొమ్ము నిలవదనుకున్నాడు.. నిజాయితీగా సంపాదించినది మాత్రమే తనదనుకున్నాడు.

Update: 2025-11-10 07:53 GMT

కొన్ని సంఘటనలు మనుషుల్లో ఇంకా నీతి, నిజాయితీ ఉన్నాయని నిరూపిస్తుంటాయి. నవీ ముంబై ఘన్సోలికి చెందిన 28 ఏళ్ల ఆటో రిక్షా డ్రైవర్ సంతోష్ షిర్కే నీతి, నిజాయితీకి తార్కాణంగా నిలిచాడు. తన ఆటోలో ప్రయాణించిన కస్టమర్ పొరపాటున వదిలివేసిన రూ. 16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును తిరిగి ఇచ్చాడు.

ఘన్సోలి నివాసి సంతోష్ మోతీలాగ్, కాశీ తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చిన తన తల్లిని ఇంటికి తీసుకువెళ్లడానికి వాషి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. 

తల్లీ కొడుకులు స్టేషన్ నుండి షిర్కే ఆటో ఎక్కి ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత, మోతీలాగ్ వారి బ్యాగుల్లో ఒకటి - 120 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలు, కొన్ని బట్టలు - ఆటోలోనే మర్చిపోయినట్లు గ్రహించాడు.

ఆందోళన చెందిన మోతీలాగ్ ఆటో డ్రైవర్ అయిన ఒక స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు. అతని స్నేహితుడు వెంటనే స్థానిక ఆటో-రిక్షా డ్రైవర్ల వాట్సాప్ గ్రూప్‌లో విలువైన వస్తువులు పోగొట్టుకున్నట్లు సందేశాన్ని పంచుకున్నాడు.

అయితే అప్పటికే ఆటో డ్రైవర్ షిర్కే ఆ బ్యాగును వాషి రైల్వే స్టేషన్ సమీపంలోని ఆటోరిక్షా యూనియన్ కార్యాలయంలో అప్పగించాడు.

మోతీలాగ్ వెంటనే యూనియన్ కార్యాలయానికి వెళ్లాడు. బ్యాగ్‌ను వాషి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ షిర్కే కస్టమర్ ని గుర్తించాడు. అనంతరం విలువైన వస్తువులను సురక్షితంగా మోతీలాగ్‌కు తిరిగి అప్పగించారు.

"షిర్కే నిజాయితీకి మోతిలాగ్ ముగ్ధుడయ్యాడు. కృతజ్ఞతగా అతనికి నగదు బహుమతిని అందించాడు, కానీ షిర్కే మర్యాదగా తిరస్కరించాడు, బాధ్యతాయుతమైన పౌరుడిగా తన విధిని మాత్రమే నిర్వర్తించానని షిర్కే చెప్పాడు.

షిర్కే నిజాయితీని పోలీసు అధికారులు ప్రశంసించారు. మంచి హృదయం కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. వాషి పోలీస్ స్టేషన్‌ సిబ్బంది అతడిని సత్కరించారు.

Tags:    

Similar News