Mumbai : గ్యాంగ్‌స్టర్లను ఎన్‌కౌంటర్‌ చేసిన స్పెషలిస్టు ప్రమోషన్‌..

ఎవరీ దయా నాయక్‌?;

Update: 2025-07-30 01:15 GMT

మహారాష్ట్రలో ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు’గా పేరొందిన దయా నాయక్‌కు ఏసీపీగా పదోన్నతి లభించింది. ఆయనతోపాటు మరికొందరు అధికారులు కూడా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ACP)లుగా ప్రమోషన్‌ పొందిన వారిలో ఉన్నారు. 1990ల్లో ముంబయిలో అండర్‌వరల్డ్‌ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్న సమయంలో దాదాపు 80 మంది గ్యాంగ్‌స్టర్లను దయా నాయక్‌ ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం. ఈయన స్ఫూర్తితో గతంలో హిందీతోపాటు పలు భాషల్లో సినిమాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

కర్ణాటకలోని ఉడిపిలో జన్మించిన దయా నాయక్‌  బాల్యం ఎక్కువగా ముంబయిలో కొనసాగింది. అంధేరీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అనంతరం 1995లో పోలీస్‌ నియామకాల్లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ముంబయిలోవిధుల్లో చేరారు. ఆ సమయానికి నగరంలో అండర్‌వరల్డ్‌ పేరుతో విపరీతంగా దందాలు, హత్యలు, డ్రగ్స్‌, హవాలా సహా ఎన్నో నేరాలు జరిగేవి. ఈ క్రమంలోనే 1996లో చోటా రాజన్‌ గ్యాంగ్‌లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయా నాయక్‌ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ప్రజల్లోనే కాక, డిపార్ట్‌మెంట్‌లోనూ ఆ పేరు మార్మోగిపోయింది. అండర్‌ వరల్డ్‌ నెట్‌వర్క్‌కు సంబంధించి పనిచేస్తున్న దాదాపు 80 మంది గ్యాంగ్‌స్టర్లను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం.

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరు సంపాదించినప్పటికీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దయా నాయక్‌ను ఏసీబీ (ACB) గతంలో అరెస్ట్‌ చేసింది. ఆ తర్వాత క్లీన్‌చిట్‌ రావడంతో మళ్లీ 2012లో ఆయన తిరిగి విధుల్లో చేరారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ATS)లోనూ పనిచేశారు. 2021లో ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani) ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసు, అనంతరం ఠాణె వ్యాపారవేత్త మన్‌సుఖ్‌ హిరెన్‌ హత్య కేసుల దర్యాప్తు బృందాల్లో ఉన్నారు. అంతేకాదు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan)పై జరిగిన దాడి ఘటన దర్యాప్తు బృందంలోనూ ఆయన కనిపించారు.

Tags:    

Similar News