JNVST 2024: నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలు.. దరఖాస్తుల గడువు పెంపు
నేటితో గడువు ముగియనున్న వేళ నవోదయ విద్యాలయ సమితి కీలక నిర్ణయం;
జవహర్ నవోదయ విద్యాలయాల్లో(Navodaya Vidyalaya) ఆరో తరగతి ప్రవేశాలకు(Class 6th admission) దరఖాస్తుల గడువు నేటితో ముగిస్తుండగా దానిని మరో వారం రోజుల పాటు పెంచుతూ నవోదయ విద్యాలయ సమితి(Navodaya Vidyalaya Samiti ) కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో నవోదయ విద్యాలయ సమితి ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు గడువును మరో వారం రోజుల పాటు పొడిగించింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది.
దేశ వ్యాప్తంగా 649 నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి సీట్ల భర్తీకి రెండు విడుతల్లో ఎంపిక పరీక్ష ( Class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2024)నిర్వహించనున్నారు. ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన ఉదయం 11:30 గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో, 2024 జనవరి 20న తెలంగాణ, ఏపీతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో 9, ఏపీలో 15 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.