Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌పై అవిశ్వాసం
తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు.. విచారకరమన్న కేంద్రమంత్రి రిజిజు;
పక్షపాత వైఖరితో సభను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు మంగళవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, నాసీర్ హుస్సేన్‌లు రాజ్యసభ ప్రత్యేక కార్యదర్శి పీసీ మోదీకి ఈ నోటీసును అందజేశారు. ఈ నిర్ణయం బాధాకరమే అయినా పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవిశ్వాసం పెట్టినట్టు ఇండియా కూటమి పేర్కొంది.
అవిశ్వాస తీర్మానానికి కనీసం 50 మంది ఎంపీల సంతకాలు అవసరం కాగా, కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఆప్, డీఎంకే తదితర పార్టీలకు చెందిన 60 మంది విపక్ష ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేశారు. అయితే కాంగ్రెస్‌లోని రాజ్యాంగ పదవుల్లో ఉన్న అగ్రనేతలు ఈ నోటీసుపై సంతకాలు చేయలేదు. అలా చేయని వారిలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఉన్నారు.
ధన్‌ఖడ్ నిబద్ధతతో పనిచేస్తున్నారు: రిజిజు
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టడం చాలా విచారకరం అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి 243 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే విపక్షాలకు ఆ సంఖ్య లేకపోవడంతో ఈ తీర్మానం నామమాత్రమేనని భావిస్తున్నారు.
సభా గౌరవాన్ని కాపాడుకోవాలి: ఓం బిర్లా
పార్లమెంటులో విపక్షాల నిరసనలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తంచేశారు. ‘మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజల ఆశలు, ఆకాంక్షలను మనం నెరవేర్చాలి. మనమందరం సభా గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ, గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు బాగుండటం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.