NEET PG: నీట్‌ పీజీ పరీక్ష వాయిదా

పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కీలక నిర్ణయం;

Update: 2024-06-23 01:15 GMT

 జూన్‌ 23న దేశవ్యాప్తంగా జరగాల్సిన నీట్-పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైద్య విద్యార్థుల కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్టీఏ) నిర్వహించే నీట్-పీజీ ప్రవేశ పరీక్ష ప్రక్రియల పటిష్టతను క్షుణ్ణంగా అంచనా వేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ముందుజాగ్రత్త చర్యగా  జూన్ 23, 2024  జరగాల్సిన నీట్-పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ పరీక్ష జరగబోయే తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తామని వెల్లడించింది. విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మనస్ఫూర్తిగా చింతిస్తోంది. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా, పరీక్షా ప్రక్రియ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

గత మూడు రోజుల్లో వాయిదా లేదా రద్దు చేసిన మూడో పోటీ పరీక్షగా నీట్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ నిలిచింది. గురువారం (జూన 20) కేంద్ర విద్యా శాఖ అంతకుముందు జరిగిన యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేసింది. ఈ పరీక్ష పేపర్ డార్క్ నెట్లో లీకైనట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. దీంతో ఈ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది.

ఎన్‌టీఏ డీజీపై వేటు..

యూజీసీ నెట్‌, నీట్‌- యూజీ పరీక్షల నిర్వహణ విషయంలో ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)’ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల నడుమ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్ ఆ పదవి నుంచి తొలగించింది. భారత వాణిజ్య ప్రచార సంస్థ (ఐటీపీఓ) ఛైర్మన్‌, ఎండీ ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాకు ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సుబోధ్‌ను కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News