Bhuni Toll Plaza: జవాన్‌ పై దాడి.. టోల్ ఏజెన్సీపై NHAI కఠిన చర్యలు..

రూ. 20 లక్షల జరిమానా, బ్లాక్ లిస్ట్ కు సన్నాహాలు..;

Update: 2025-08-19 00:45 GMT

ఆగస్టు 17 రాత్రి మీరట్-కర్నాల్ జాతీయ రహదారి (NH-709A)లోని భూని టోల్ ప్లాజా వద్ద దారుణం చోటుచేసుకుంది. టోల్ సిబ్బంది భారత ఆర్మీ జవాన్ కపిల్ సింగ్, అతని సోదరుడు శివంపై దారుణంగా దాడి చేశారు. ఈ సంఘటన తర్వాత, నేషనల్ హైవే అథారిటీ (NHAI) కఠిన చర్యలు తీసుకుంది. టోల్ వసూలు సంస్థ అయిన మెస్సర్స్ ధరమ్ సింగ్ & కంపెనీపై రూ. 20 లక్షల జరిమానా విధించింది. ఆ కంపెనీ కాంట్రాక్ట్ ను రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో టోల్ ప్లాజా బిడ్డింగ్‌లో పాల్గొనకుండా నిరోధించే ప్రక్రియను ప్రారంభించింది.

ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన NHAI వెంటనే చర్య తీసుకుని టోల్ వసూలు సంస్థపై రూ.20 లక్షల భారీ జరిమానా విధించింది. కంపెనీ తన ఉద్యోగులను క్రమశిక్షణతో ఉంచడంలో, టోల్ ప్లాజా వద్ద శాంతిభద్రతలను కాపాడుకోవడంలో విఫలమైందని, ఇది ఒప్పందానికి పెద్ద ఉల్లంఘన అని NHAI ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఇటువంటి ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, జాతీయ రహదారులపై ప్రయాణీకుల సురక్షితమైన, అంతరాయం లేని ప్రయాణాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాము’ అని NHAI ఒక ప్రకటన విడుదల చేసింది.

మీరట్‌లోని గోట్కా గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కపిల్ సింగ్ ఆగస్టు 17 రాత్రి తన బంధువు శివంతో కలిసి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నాడు. శ్రీనగర్‌లో తన విధుల్లో చేరాల్సి ఉంది. భూని టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమయం లేకపోవడం వల్ల, వాహనాన్ని త్వరగా వెళ్లనివ్వమని కపిల్ టోల్ ఉద్యోగులను విజ్ఞప్తి చేశాడు. దీనిపై వివాదం తీవ్రమైంది. టోల్ ఉద్యోగులు జవాన్‌ పై దాడికి దిగారు. ఉద్యోగులు కపిల్‌ను ఒక స్తంభానికి కట్టివేసి కర్రలతో కొట్టారని, ఒక ఉద్యోగి ఇటుకను ఎత్తడానికి కూడా ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. మీరట్ పోలీసులు వెంటనే చర్య తీసుకుని ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇతర నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

Tags:    

Similar News