Nipah Virus: నిఫా కలకలం.. ఆసియా దేశాలు అప్రమత్తం
థాయ్‌లాండ్, నేపాల్, తైవాన్ ఎయిర్‌పోర్టుల్లో కొవిడ్ తరహా స్క్రీనింగ్
పశ్చిమ బెంగాల్‌లో నిఫా వైరస్ కేసులు వెలుగుచూడటంతో పలు ఆసియా దేశాలు అప్రమత్తమయ్యాయి. థాయ్‌లాండ్, నేపాల్, తైవాన్ వంటి దేశాలు తమ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కొవిడ్ తరహా ఆరోగ్య తనిఖీలను పునఃప్రారంభించాయి. అయితే, బెంగాల్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఇప్పటివరకు కేవలం రెండు కేసులే నమోదయ్యాయని భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం థాయ్‌లాండ్‌లోని సువర్ణభూమి, డాన్ ముయాంగ్, ఫుకెట్ విమానాశ్రయాల్లో జనవరి 25 నుంచి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు ఆరోగ్య సమాచారాన్ని తెలిపే ఫారాలను నింపాల్సి ఉంటుంది. జ్వరం వంటి లక్షణాలు ఉంటే వారిని ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు. ఇదే తరహా చర్యలను నేపాల్ ప్రభుత్వం ఖాట్మండు విమానాశ్రయంతో పాటు భారత్‌తో ఉన్న సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద కూడా ప్రారంభించింది.
పశ్చిమ బెంగాల్‌లో డిసెంబర్ 2025 నుంచి ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు నిఫా సోకినట్లు జనవరి 13న అధికారికంగా నిర్ధారించారు. ఈ రెండు కేసులకు సంబంధించి 196 మందిని గుర్తించి పరీక్షించగా, అందరికీ నెగెటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జనవరి 27న ఒక ప్రకటనలో తెలిపింది. మీడియాలో వస్తున్న అధిక సంఖ్య కేసుల వార్తలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నిఫా వైరస్ మరణాల రేటు 40 నుంచి 75 శాతం వరకు ఉండటం, దీనికి నిర్దిష్ట చికిత్స లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో స్వల్ప సంఖ్యలో కేసులు నమోదైనా ఆయా దేశాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తైవాన్ కూడా నిఫా వైరస్‌ను అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల జాబితాలో చేర్చేందుకు ప్రతిపాదనలు చేసింది.