Nitish Kuma: రాజ్యసభకు నీతీశ్‌!.. సీఎం పదవికి త్వరలో రాజీనామా?

జేడీయూలో రాజకీయ వేడి ..కొత్త సీఎం ఎవరు?

Update: 2026-03-05 01:00 GMT

బీహార్‌లో పెను రాజకీయ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి నితీశ్‌ కుమార్‌ను రాజ్యసభకు పంపేందుకు నామినేషన్‌ పత్రాలు సిద్ధమయ్యాయని, ఆయన వాటిపై సంతకం చేయడం ఒక్కటే మిగిలి ఉందని జేడీయూ వర్గాలు తెలిపాయి.

మార్చి 5న నితీశ్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలుచేస్తారని తెలుస్తున్నది. ఈ పరిణామంతో జేడీయూలో రాజకీయ వేడి రాజుకుంది. నితీశ్‌ కుమార్‌ను రాజ్యసభకు పంపడానికి అవసరమైన లాంఛనాలన్నీ తుది దశలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. రాజ్యసభ ఎన్నికపై జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో జేడీయూ కార్య నిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌ ఝా బుధవారం నితీశ్‌ కుమార్‌ను కలుసుకుని దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. ఈ సుదీర్ఘ సమావేశంలో విస్తృత రాజకీయ వ్యూహంపై చర్చలు జరిగినట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. అదే సమయంలో కేంద్ర మంత్రి లలన్‌ సింగ్‌ గురువారం ఉదయం ఢిల్లీ నుంచి పాట్నాకు రానుండడంతో పార్టీలో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి.

కొత్త సీఎం ఎవరు?

ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ రాజ్యసభకు వెళితే బీహార్‌కు కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న ఉదయిస్తున్నది. అటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవిని బీజేపీ కోరుతుందని, అదే జరిగితే బీహార్‌లో రాజకీయంగా పెను మార్పులు తథ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. జేడీయూ రెండవ అభ్యర్థిగా రామ్‌నాథ్‌ ఠాకూర్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేయవచ్చని తెలుస్తున్నది. తాజా పరిణామంలో భాగంగా మార్చి 8న ప్రారంభం కావలసిన నితీశ్‌ కుమార్‌ సమృద్ధి యాత్ర వాయిదా పడవచ్చని జేడీయూ వర్గాలు చెప్పాయి. ఈ యాత్ర వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ద్వారా ముఖ్యమంత్రి నితీశ్‌ రాష్ట్ర రాజకీయాలకు వీడ్కోలు చెప్పి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

వారసుడెవరో..

నీతీశ్‌ గత నవంబరు 20న పదోసారి బిహార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాష్ట్రాన్ని అత్యంత ఎక్కువకాలం పాలించిన ఘనత ఆయనదే. దానికి ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నాలుగు నెలల్లోపే నీతీశ్‌ ఆ పదవి నుంచి వైదొలగనుండటంతో వారసుడు ఎవరనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆయన కుమారుడు, ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు నిశాంత్‌ రాజకీయాల్లోకి రానున్నారని, త్వరలోనే ఈ నిర్ణయాన్ని జేడీయూ అధికారికంగా ప్రకటిస్తుందని రాష్ట్ర మంత్రి శ్రవణ్‌ కుమార్‌ ఇప్పటికే వెల్లడించారు. కుమారుడు రాజకీయాల్లోకి రావడాన్ని నీతీశ్‌ కూడా అంగీకరించారు. నిశాంత్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టొచ్చని తెలుస్తోంది.

Tags:    

Similar News