Siddaramaiah: కర్ణాటక సీఎం మార్పుపై సిద్దరామయ్య ఫుల్ క్లారిటీ

డీకే శివకుమార్‌తో ఎలాంటి పవర్ షేరింగ్ డీల్ లేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌

Update: 2025-12-19 07:45 GMT

కర్ణాటక సీఎం పీఠంపై గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు సీఎం సిద్దరామయ్య తెరదించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తనకు ఎలాంటి పవర్ షేరింగ్ డీల్ లేదని, పూర్తి ఐదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని ఆయన అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం మద్దతు కూడా తనకే ఉందని సిద్దరామయ్య తేల్చిచెప్పారు.

ఈరోజు ఉదయం రాష్ట్ర అసెంబ్లీలో సిద్దరామయ్య మాట్లాడుతూ.. "నేను గతంలో ఒకసారి పూర్తి ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేశాను. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాను. నా అభిప్రాయం ప్రకారం అధిష్ఠానం నా పక్షాన ఉంది. పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న నిర్ణయం ఏదీ జరగలేదు" అని అన్నారు. వారం వ్యవధిలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి.

2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లు చెరి సగం పంచుకుంటారని ప్రచారం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారమే మధ్యంతర మార్పు జరుగుతుందని డీకే శివకుమార్ వర్గం గట్టిగా ఆశిస్తోంది. అయితే, సిద్దరామయ్య తాజా వ్యాఖ్యలతో ఆ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం రాత్రి మంత్రి సతీశ్ జార్కిహోళి ఇచ్చిన విందుకు సిద్దరామయ్య, ఆయనకు సన్నిహితులైన కొందరు మంత్రులు హాజరయ్యారు. ఈ విందుకు డీకే శివకుమార్‌కు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమైంది. అయితే, దీనిపై డీకే శివకుమార్ స్పందిస్తూ, "విందు భోజనానికి వెళ్లడంలో తప్పేముంది?" అని వ్యాఖ్యానించి వివాదాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం ఈ అంశం కాంగ్రెస్ అధిష్ఠానం వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. 2028 ఎన్నికల్లో డీకే శివకుమార్‌కు మద్దతిస్తానని, అప్పటివరకు తనను కొనసాగించాలని సిద్దరామయ్య ప్రతిపాదించినట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News