COVID-19 Vaccine: కొవిడ్‌ టీకాలతో ముప్పులేదు

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి క్లారిటీ..;

Update: 2025-07-26 01:03 GMT

భారతదేశంలో 18-45 వయసువారిలో ఆకస్మిక మరణ ప్రమాదం కొవిడ్‌ టీకాల వల్ల పెరగలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం లోక్‌సభకు తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనం ఈ సంగతి నిగ్గుదేల్చిందని వివరించారు. కొవిడ్‌ వల్ల ఆస్పత్రిపాలవడం, కుటుంబంలో ఆకస్మిక మరణాలకు గురైన చరిత్ర ఉండటం, మరణానికి 48 గంటల ముందు అతిగా తాగడం లేదా అతిగా వ్యాయామం చేయడం, మాదకద్రవ్యాలు తీసుకోవడం వంటివి జరిగితే ఆకస్మిక మరణ ముప్పు పెరుగుతుందని తేలింది. 2023 మే-ఆగస్టులో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 47 ఆస్పత్రులలో ఐసీఎంఆర్‌-జాతీయ అంటువ్యాధుల పరిశోధన సంస్థ (ఎన్‌ఐఈ) అధ్యయనం జరిపాయి. రెండు డోసుల కొవిడ్‌ టీకాలు తీసుకుంటే ఆకస్మిక మరణ ప్రమాదం తగ్గుతుందని తేలినట్లు నడ్డా తెలిపారు. ఐసీఎంఆర్, ఎయిమ్స్‌ అధ్యయనం కూడా ఇదే సంగతి నిర్ధారించిందని చెప్పారు.

కొవిడ్‌-19 టీకాల వల్ల 2020 నుంచి 2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలకుపైగా అకాల మరణాలను నిలువరించగలిగినట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ప్రతి 5400 టీకా డోసులకు ఒకటి చొప్పున మరణాన్ని ఆపగలిగినట్లు తెలిపింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వల్ల ప్రయోజనం కలిగిందనడానికి ఇది విస్పష్ట ఆధారమని వివరించింది. ఇటలీలోని క్యాథలిక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మిలాన్, అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. వీరు కొవిడ్‌-19కు సంబంధించిన ప్రపంచవ్యాప్త మరణాల డేటాను విశ్లేషించారు. ఈ మరణాలు టీకా వేసుకోవడానికి ముందు సంభవించాయా లేక ఆ తర్వాత చోటుచేసుకున్నాయా అన్నది పరిశీలించారు. దీని ఆధారంగా.. ఒక నమూనాను రూపొందించి, కొవిడ్‌ టీకా లేకుంటే ఎన్ని మరణాలు సంభవించి ఉండేవన్నది గణించారు. టీకాల వల్ల ప్రాణాలు కాపాడుకున్నవారిలో 82 శాతం మంది.. వైరస్‌ సోకడానికి ముందే వ్యాక్సిన్లు పొందారని శాస్త్రవేత్తలు తెలిపారు. టీకాల సాయంతో మరణాన్ని తప్పించుకున్నవారిలో 90 శాతం మంది.. 60 ఏళ్లు పైబడ్డవారేనని వివరించారు.

Tags:    

Similar News