Supreme Court: సత్యేందర్ జైన్ జైలుకే..
ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ పటిషన్ కొట్టివేత;
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు ఆయన వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే ఆయన లొంగిపోవాల్సి రానున్నది. సత్యేందర్ జైన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్ ధర్మాసనం ఎదుటన వాదనలు వినిపించగా.. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. గతేడాది డిసెంబర్ 14న కోర్టు మాజీ మంత్రికి ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.
2023, మే 26న మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా.. జనవరి 8 వరకు పొడిగిస్తూ వచ్చింది. రెగ్యులర్ బెయిల్‌పై 2023 ఏప్రిల్ 6న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మనీలాండరింగ్ ఆరోపణలపై మే 30, 2022న ఆప్ నేతను ఈడీ అరెస్టు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద జైన్‌పై 2017లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఆయనపై చర్యలు తీసుకున్నది. సీబీఐ కేసులో ఆయనకు ట్రయల్ కోర్టు 2019 సెప్టెంబర్ 6న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.