Mumbai: ఫేస్‌బుక్ లైవ్‌లో శివసేన నేత కుమారుడి కాల్చివేత
ఈవెంట్ కోసం అభిషేక్‌ను ఆహ్వానించి కాల్చివేసిన నిందితుడు;
ఫేస్‌బుక్ లైవ్‌లో రాజకీయ నాయకుడి కుమారుడు హత్యకు గురయ్యాడు. అతడితో పాటు లైవ్‌లో ఉన్న వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత, మాజీ కౌన్సిలర్ వినోద్ ఘోసల్కర్ కుమారుడు అభిషేక్‌తో పాటు ఫేస్‌బుక్ లైవ్‌లో పాల్గొన్న వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. ఎంహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాహిసార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.
శివసేన (యూబీటీ) నేత కుమారుడిని ఒక వ్యక్తి కాల్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దహిసార్ ప్రాంతంలో శివసేన (యూబీటీ) మాజీ కౌన్సిలర్ వినోద్ ఘోసల్కర్ కుమారుడు అభిషేక్ ఘోసల్కర్ ఫేస్‌బుక్ లైవ్‌లో ఉండగా ఒక వ్యక్తి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు.తర్వాత అదే తుపాకీతో తానూ కాల్చుకున్నాడు. ఇదంతా ఫేస్‌బుక్ లైవ్‌లో రికార్డయ్యింది.ఘోసల్కర్‌పై మారిస్ భాయ్‌గా పిలిచే మారిస్ నోరోన్హా ఆఫీసు వద్ద దాడి జరిగింది. స్నేహితులైన ఇద్దరూ అభిప్రాయ బేధాలతో కొన్నాళ్లు దూరంగా ఉన్నా ఇటీవలే మళ్లీ కలిసిపోయారు. ఈ క్రమంలో ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న ఈవెంట్ కోసం అభిషేక్‌ను తన ఆఫీసుకు ఆహ్వానించాడు. కాల్పులు జరపడానికి గల కారణాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ఈ ఘటనపై ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘అభిషేక్ ఘోసల్కర్‌పై కాల్పులు జరిపినట్టు నాకు సమాచారం అందింది... ఇలా ఎన్ని రోజులు భరించాలి.. దీంతో మహారాష్ట్ర పరువు పోవడమే కాదు.. ప్రజలు కూడా భయపడుతున్నారు.. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పరిశ్రమలు రావడం లేదు. మహారాష్ట్రకు రావడానికి భయపడుతున్నారు.. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఏర్పడింది’ అని ఆదిత్య ఠాక్రే అన్నారు.
కాగా, నాలుగు రోజుల కిందట షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపిన వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్‌లోనే ఈ ఘటన జరగడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో అభిషేక్ ఘోసల్కర్ హత్య జరగడం గమనార్హం.