Doctors Protest: దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలు, ర్యాలీలు
వైద్యురాలి ఘటనలో నిందితుడిని శిక్షపడేదాకా నిరసన బాటే;
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా లో ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ వైద్యులు ఆందోళన బాట పట్టారు . ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానల రెసిడెంట్ డాక్టర్లు ఢిల్లీ, కోల్‌కతా, రాజస్థాన్, యూపీ సహా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కోరుతున్నారు.
వైద్యుల సమ్మెతో దవాఖానల్లో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఓపీ సేవలు, అత్యవసరం కాని సర్జరీలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ ఆసుపత్రుల ముందు క్యూలో నిల్చున్నా ఫలితం లేకుండా పోయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు వైద్యుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యుల సమ్మెకు అర్థం ఉందని.. మరి మా పరిస్థితి ఏంటని వాపోతున్నారు.
వారంలో ఛేదించకుంటే సీబీఐకి: మమత
వైద్యురాలి కేసును ఆదివారంలోగా ఛేదించాలని బెంగాల్ పోలీసులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. ‘‘ఈ దారుణం వెనక ఆస్పత్రి లోపలి వ్యక్తుల హస్తం కూడా ఉందని వైద్యురాలి కుటుంబం అనుమానిస్తోంది. వారెవరో కనిపెట్టి ఆదివారం లోపు అందరినీ అరెస్టు చేయాలి. లేని పక్షంలో కేసును సీబీఐకి అప్పగిస్తా’’ అని ప్రకటించారు. సోమవారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
నిజానికి పలు కేసుల దర్యాప్తులో సీబీఐ చేసిందేమీ పెద్దగా లేదంటూ పెదవి విరిచారు. అయినా అవసరమైతే ఈ కేసును దానికి అప్పగిస్తామన్నారు. తీవ్రత దృష్ట్యా ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. మమత డెడ్‌లైన్ నేపథ్యంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మీడియాతో మాట్లాడారు. నాలుగైదు రోజుల్లో దోషులందరినీ పట్టుకుంటామన్నారు. ఈ దారుణం గురించి తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని తృణమూల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నన్ను ఉరి తీసుకోండి: నిందితుడు
దారుణానికి పాల్పడ్డ సంజయ్ రాయ్‌లో పశ్చాత్తాపమే లేదని పోలీసులంటున్నారు. విచారణలో నేరం అంగీకరించడమే గాక, ‘కావాలంటే ఉరి తీసుకొ’మ్మని అన్నట్టు తెలుస్తోంది. రాయ్ ఆసుపత్రి ఉద్యోగి కాదు. కోల్‌కతా పోలీసు శాఖలో పౌర వలంటీర్‌గా ఆస్పత్రిలోని పోలీస్ ఔట్‌పోస్టులో పని చేస్తున్నాడు. అడ్మిషన్ కోసం రోగుల నుంచి డబ్బు వసూలు చేసేవాడు. కోల్‌కతా పోలీస్ (కేపీ) అని రాసున్న టీ షర్ట్‌తో తిరుగుతున్నాడు. అతని బైక్‌కు కూడా కేపీ ట్యాగ్ ఉంది. రాయ్ మొబైల్ ఫోన్ నిండా అశ్లీల దృశ్యాలే ఉన్నట్టు తెలిసింది.