Heavy rain: : ఢిల్లీలో భారీ వర్షాలు.. జలమయమైన నగరం, నిలిచిన 100కి పైగా విమానాలు

కూలిన పోలీస్ స్టేషన్;

Update: 2025-05-25 03:30 GMT

 దేశ రాజధాని ఢిల్లీలో వాన దంచికొట్టింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం  కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రహదారులన్నీ వరద నీటితో నిండిపోయాయి. దీంతో ప్రధాన జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వందకు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మరో 25కి పైగా విమానాలను దారి మళ్లించారు.

ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు అడ్వైజరీ జారీచేసింది. ప్రతికూల వాతారణంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని, ఇంకా సర్వీసులను పునరుద్ధరించలేదని పేర్కొంది. ప్రయాణికులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని కోరింది.

ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అని వాతావరణ శాఖ తెలిపింది. సఫ్దర్‌జంగ్‌ ప్రాంతంలో 81 మిల్లీ మీటర్లు, పాలంలో 68 మిల్లి మీటర్లు, పూసా 71 మిల్లి మీటర్లు, మయూర్ విహార్‌లో 48 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల దవేగంతో గాలులు వీచాయని వెల్లడించింది. భారీ వర్షంతో మింటో రోడ్డు వద్ద ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఒక కారు మునిగిపోయింది.

భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఘజియాబాద్ లోని పోలీస్ స్టేషన్ కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకుని ఎస్సై దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఏసీపీ అంకుర్ విహార్ ఆఫీస్ లో వీరేంద్ర మిశ్రా(58) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి భారీ వర్షం, పెనుగాలులకు స్టేషన్ పైకప్పు కుప్పకూలింది.

Tags:    

Similar News