Indian Military Trains: ఆర్మీ రైళ్ల కదలికలపై పాక్ స్పై ఏజెన్సీల నిఘా..?
అప్రమత్తమైన భారతీయ రైల్వే..! ఉద్యోగులకు అడ్వైజరీ జారీ;
భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పాకిస్థాన్ కోలుకునే అవకాశం లేకుండా చేసింది. రాత్రి 1:05 నుంచి 1:30 వరకు భారత సైన్యం చేసిన దాడి పాకిస్థాన్ సైన్యాన్ని కుదిపేసింది. దాడి ముగిసిన 25-30 నిమిషాల వరకు.. పాకిస్థాన్ ఎలా స్పందించాలో అర్థం కాలేదు. నిమిషాల వ్యవధిలో మొత్తం అయిపోయింది. కాగా.. ఈ దాడి తరువాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. భారత ‘సైనిక రైళ్ల’ కదలికల గురించి తెలుసుకునేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. రహస్య సమాచారాన్ని ఎవ్వరితో పంచుకోవద్దని సూచించింది. ఈ మేరకు ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. సమాచారం బహిర్గతం చేయడం జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని తెలిపింది.
“భారత మిలటరీ రైళ్ల కదలికలకు సంబంధించి కీలక సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు రాబట్టే అవకాశం ఉంది. రైల్వేలో మిలటరీ విభాగానికి తప్ప.. ఎటువంటి అనధికార వ్యక్తులకు ఆ సమాచారం ఇచ్చినా భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తాం. దానివల్ల దేశ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. సైనిక రైళ్ల కదలికల సమాచారానికి ఉన్న ప్రాధాన్యం, తీవ్రత దృష్ట్యా దీనిపై రైల్వే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి” అని అన్ని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్లకు పంపిన సందేశంలో రైల్వే బోర్డు పేర్కొంది.