Pak-India: మళ్లీ రెచ్చగొట్టిన పాక్ సైన్యం
కాల్పులను తిప్పికొట్టిన భారత సైన్యం;
పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వరుసగా నాలుగో రోజు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. భారత సైన్యం అప్రమత్తమై.. సమర్థవంతంగా కాల్పులను తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం అందలేదు.
ఏప్రిల్ 27-28 అర్ధరాత్రి సమయంలో కుప్వారా, పూంచ్ జిల్లాలకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ ఆర్మీ పోస్టులు కాల్పులు జరిపాయని భారత్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అంతే వేగంగా.. సమర్థవంతంగా కాల్పులను తిప్పికొట్టినట్లు పేర్కొంది.
పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాక్‌ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచివెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతోపాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పరిణామాల వేళ సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.