Patna Hospital: పిస్తోళ్లతో ఆస్పత్రిలోకి ఎంట్రీ.. మర్డర్ నిందితుడిని షూట్ చేసిన ప్రత్యర్థులు
ఎన్నికల ముందు మరొక హత్య..;
అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్‌లో హత్యల పరంపర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న బీజేపీ నేత, వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా ఇంటి దగ్గరే హత్యకు గురయ్యారు. కారులో ఇంటికి చేరిన ఆయన్ను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందు తాజాగా గురువారం ఉదయం పట్టపగలు ఆస్పత్రిలో కరుడుగట్టిన ఒక నేరస్థుడ్ని ప్రత్యర్థి గ్యాంగ్ తుపాకులతో కాల్చి చంపింది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితీష్ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత కరవైందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
చందన్ మిశ్రా.. కరుడుగట్టిన నేరస్థుడు. వైద్యం నిమిత్తం పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ప్రత్యర్థి వర్గానికి ఐదుగురు సభ్యులు కలిగిన ముఠా ఆస్పత్రిలోని చందన్ మిశ్రా ఉన్న గదిలోకి ప్రవేశించి తుపాకులతో విరుచుకుపడ్డారు. బుల్లెట్లు దూసుకెళ్లడంతో చందన్ మిశ్రా అక్కడికక్కడే చనిపోయాడు. ఇక తుపాకీ శబ్దాలకు రోగులు, బంధువులు హడలెత్తిపోయారు. అనంతరం దుండుగులు అక్కడ నుంచి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయింది.
బక్సర్ జిల్లా నివాసి అయిన చందన్ మిశ్రా కరుడు గట్టిన నేరస్థుడు. అతడిపై డజన్ల కొద్దీ కేసులున్నాయి. భాగల్పూర్ జైల్లో ఉంటున్నాడు. వైద్య చికిత్స కోసం పెరోల్‌పై పాట్నా ఆస్పత్రికి వచ్చాడు. అయితే ప్రత్యర్థి వర్గం కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. బాక్సర్ జిల్లా పోలీసుల సాయంతో నిందితులను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కార్తీకాయ్ శర్మ పేర్కొన్నారు. చందన్ మిశ్రా గాయాలతో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. నేరస్థులను పట్టుకుంటామని ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటన దురదృష్టకరమని… దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. నేరస్థులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.