Thar : థార్ నడపడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు : హర్యాణా డీజీపీ
ఏసీపీ కుమారుడి ఘటనను ఉదాహరణగా పేర్కొన్న పోలీసు చీఫ్
థార్ ఎస్‌యూవీలు, బుల్లెట్ మోటార్‌సైకిళ్లు నడిపే వారి ప్రవర్తనపై హర్యానా డీజీపీ ఓపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లరి చేసేవారు, పోకిరీలు ఎక్కువగా ఇలాంటి వాహనాలనే వినియోగిస్తారని, అందువల్ల వాటిని చూసీచూడనట్లు వదిలేయలేమని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
శనివారం గురుగ్రామ్‌లో విలేకరులతో మాట్లాడిన ఓపీ సింగ్ (దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బావ), వాహనాల తనిఖీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మేము రోడ్డుపై వెళ్లే అన్ని వాహనాలను ఆపి తనిఖీ చేయం. కానీ, ఒక థార్ కారు కనిపిస్తే దాన్ని ఎలా వదిలేస్తాం? బుల్లెట్ బైక్ కనిపించినా అంతే. ఎందుకంటే సమాజంలో అల్లరిచిల్లరగా తిరిగే వాళ్లంతా ఇలాంటి వాహనాలనే వాడుతున్నారు. ఒక వ్యక్తి ఎంచుకునే వాహనం వారి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా థార్ నడిపేవారు రోడ్లపై స్టంట్లు చేస్తుంటారు" అని ఆయన అన్నారు.
థార్ అనేది కేవలం ఒక కారు కాదని 'నేను ఇంతే' అని చాటిచెప్పే ఒక స్టేట్‌మెంట్‌గా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఒక ఘటనను ఆయన ఉదాహరించారు. "ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కుమారుడు థార్ కారుతో ఒకరిని ఢీకొట్టి చంపాడు. ఇప్పుడు తన కొడుకును విడిపించాలని ఆయన కోరుతున్నారు. కానీ ఆ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందని మేము అడిగాం. అది ఆయన పేరు మీదే ఉంది. కాబట్టి అసలైన పోకిరీ ఆయనే" అని డీజీపీ ఘాటుగా వ్యాఖ్యానించారు.
సొంత శాఖలోని వారిని కూడా వదలకుండా "మన పోలీసు శాఖలో ఎంతమందికి థార్ కార్లు ఉన్నాయో జాబితా తీస్తే కచ్చితంగా ఆ కారు ఉన్నవాడికి కొంచెం పిచ్చి ఉంటుంది. గూండాయిజం చేస్తూ, అదే సమయంలో పట్టుబడకూడదంటే కుదరదు. ప్రదర్శన చేయాలనుకుంటే, దాని పర్యవసానాలను కూడా ఎదుర్కోవాల్సిందే" అని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
డీజీపీ ఓపీ సింగ్ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకుంటున్నారు. కొందరు డీజీపీ చెప్పింది నిజమేనని, థార్, బుల్లెట్ వాహనాలు గూండాలకు గుర్తింపుగా మారాయని సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలా సాధారణీకరించడం సరికాదని, రోడ్ల దుస్థితి, పోలీసుల బాధ్యత గురించి ప్రశ్నిస్తున్నారు. "బుల్లెట్ బైకులు వాడి ఎన్ని నేరాలు జరిగాయి? చైన్ స్నాచింగ్‌లు, హత్యలు జరిగాయా?" అని ఒకరు ప్రశ్నించగా, "డీజీపీ చెప్పింది అక్షరాలా నిజం. వారి నిర్ణయం ప్రశంసనీయం" అని మరొకరు మద్దతు తెలిపారు.
ఇటీవల గురుగ్రామ్‌లో ఒక థార్ కారు డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురిలో ఐదుగురు మరణించిన ఘటన ఈ ఆందోళనలకు మరింత బలం చేకూరుస్తోంది. బాధితుల చేతులకు పబ్ రిస్ట్‌బ్యాండ్‌లు ఉండటంతో వారు పార్టీ నుంచి వస్తున్నట్లు పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో డీజీపీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.