Madhya Pradesh: యజమానిని కాపాడేందుకు పులితో పోరాడిన శునకం..

ఇది కదా విశ్వాసం అంటే..;

Update: 2025-03-03 05:30 GMT

కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదు అనే మాట తరచూ వింటూ ఉంటాం. విశ్వాసానికి కుక్కలను ప్రతీకలుగా చెబుతుంటారు. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు అవి జీవితాంతం మనకు విశ్వాసంగా ఉంటాయి. అందుకే చాలా మంది కుక్కలను చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. అయితే.. ఈ విశ్వాసం చూపించడంలో భాగంగా ఇంటి కాపలా ఉంటూ, దొంగల బారి నుంచి ఇంటిని, ఇంటి వస్తువులను రక్షించడమే కాదు.. అవసరం అయితే తమ ప్రాణాలను అడ్డేసి, యజమాని ప్రాణాలు కాపాడుతాయని తాజాగా ఓ శునకం నిరూపించింది. అడవి నుంచి ఊర్లోకి వచ్చిన ఓ పులి, ఓ మనిషిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా, అతని పెంపుడు జర్మన్‌ షెఫర్డ్‌(కుక్క) ఏకంగా ఆ పులిపై తిరగబడింది. ఈ ఘటన మన దేశంలోని మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

సత్నా జిల్లాలోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ సమీపంలో ఫిబ్రవరి 26న శివం అనే వ్యక్తి తన పెంపుడు కుక్కతో ఇంటి బయటికి వచ్చారు. అదే సమయంలో అడవి నుంచి బయటికి వచ్చిన ఓ పులి శివంపై దాడికి ప్రయత్నించింది. కానీ అతని కుక్క పులిని ఎదుర్కొని బిగ్గరగా మొరగడం ప్రారంభించింది. దాంతో పులి, ఆ కుక్కపై దాడి చేసింది. రెండు కొద్ది సేపు హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి పులి, ఆ జర్మన్ షెపర్డ్ కుక్కను తన దవడలతో పట్టుకుని గ్రామం వెలుపలకు తీసుకెళ్లింది. కుక్క కూడా తగ్గకుండా పులిపైకి తిరగబడటంతో చివరికి, పులి దానిని విడిచిపెట్టి తిరిగి అడవిలోకి పారిపోయింది.

పులితో ప్రాణాలకు తెగించి పోరాటం చేయడంతో కుక్క తీవ్ర గాయాలపాలైంది. ముఖ్యంగా దాని మెడ భాగంగా తీవ్ర గాయమైంది. పులి తన బలమైన దవడలో మెడను కొరకడంతో కుక్క కొన ఊపరితో కొట్టుకుంటుండగా యజమాని శివం దాన్ని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ జర్మన్‌ షెఫర్డ్‌ మృతి చెందింది. యజమాని ప్రాణాలు కాపాడి తన ప్రాణాలను త్యాగం చేసింది. తన ప్రాణాలు రక్షించి, తన ప్రాణాలు వదిలేసిన తన పెంపుడు కుక్కను చూసి యజమాని శివం కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే లేకుంటే తాను ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడిని కాదంటూ దాని త్యాగాన్ని తల్చుకుంటూ బాధపడుతున్నారు. ఈ ఘటనతో కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో మరోసారి ఈ ప్రపంచానికి తెలిసొచ్చింది.

Tags:    

Similar News