High Court : వేశ్యా గృహం నడపటానికి రక్షణ కల్పించండి.. హైకోర్టును కోరిన న్యాయవాది
మద్రాసు హైకోర్టులో ఓ ఆశ్చర్యకరమైన కేసు;
వేశ్యా గృహాన్ని నడపటానికి రక్షణ కల్పించాలని ఓ న్యాయవాది కోరడంతో మద్రాస్ హైకోర్టు దిగ్భ్రాంతికి గురైంది. అడ్వకేట్ రాజా మురుగన్ హైకోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేశారు. వేశ్యా గృహాన్ని నిర్వహిస్తున్నందుకు పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని, కోరారు. విచారణకు చేపట్టిన జస్టిస్ పుగళేంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వయోజనులు ఇష్టపూర్వకంగా సెక్స్ చేసుకునే హక్కుల ఆధారంగా తన చర్యలను సమర్థించుకుంటున్న పిటిషనర్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. న్యాయ శాస్త్ర డిగ్రీ సర్టిఫికెట్, బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికెట్‌లను సమర్పించాలని మురుగన్‌ను ఆదేశించింది.
మద్రాసు హైకోర్టులో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అని చెప్పుకునే వ్యక్తి తమిళనాడులో వ్యభిచార గృహం నడుపుతున్నందుకు భద్రత కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం పిటిషనర్‌కు జరిమానా విధించింది. కన్యాకుమారిలోని నాగర్‌కోయిల్‌లో పిటిషనర్ వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నందుకు తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
అయితే జస్టిస్ బి పుగలేంధీ ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రసిద్ధ న్యాయ కళాశాలల గ్రాడ్యుయేట్‌లకు మాత్రమే సభ్యత్వం ఇచ్చేలా బార్ కౌన్సిల్‌ను కోరింది. దీంతో పాటు పిటిషనర్‌కు రూ.10,000 జరిమానా కూడా విధించింది. లైవ్ లా నివేదిక ప్రకారం.. సమాజంలో న్యాయవాదుల ఖ్యాతి నిరంతరం క్షీణిస్తోందని బార్ కౌన్సిల్ గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని కోర్టు పేర్కొంది. బార్ కౌన్సిల్ కనీసం పేరున్న సంస్థల నుంచి పట్టభద్రులకు మాత్రమే సభ్యత్వం ఇచ్చేలా చూడాలని తెలిపింది.
తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, తాను ట్రస్టును నడుపుతున్నానని, ఇందులో పెద్దల మధ్య అంగీకార సెక్స్‌పై కౌన్సెలింగ్, 18 ఏళ్లు పైబడిన వారికి ఆయిల్ బాత్ వంటి సేవలు అందిస్తున్నట్లు మురుగన్ పిటిషన్‌లో తెలిపారు. వ్యభిచార గృహం నిర్వహణలో పోలీసుల జోక్యాన్ని ఆపాలని ఆదేశించాలని కోరారు. దీనిపై హైకోర్టు మాట్లాడుతూ.. బుద్ధదేవ్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుడు సందర్భంలో మురుగన్ అర్థం చేసుకున్నారని తెలిపింది. బుద్ధదేవ్ కేసు కింద సెక్స్ వర్కర్ల అక్రమ రవాణా, పునరావాసం నిరోధానికి సుప్రీం కోర్టు హామీ ఇచ్చిందని హైకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు మురుగన్ న్యాయ విద్య మరియు బార్ అసోసియేషన్ సభ్యత్వాన్ని ధృవీకరించడానికి అతని ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికేట్, లా డిగ్రీని సమర్పించాలని కోరింది.