రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జపాన్ చేరుకున్నారు. టోక్యో విమానాశ్రయంలో దిగిన ప్రధానికి జపాన్ మంత్రులు, భారత అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ టోక్యోలో ల్యాండ్ అయ్యానంటూ ట్వీట్ చేశారు. ‘టోక్యోలో అడుగుపెట్టాను. అభివృద్ధిలో ఇరు దేశాలు పరస్పరం సహకారంతో ముందుకు నడుస్తున్నాయి. ప్రధాని ఇషిబాతో భేటీకి ఎదురుచూస్తున్నాను. తద్వారా ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను మరింతగా పెంచుకోవడానికి, సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి అవకాశం లభిస్తుంది’ అని పోస్టు చేశారు.
ఏఐ, సెమీకండక్టర్లు, పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ప్రధాని మోదీ 29, 30 తేదీల్లో జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్- జపాన్ 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. అనంతరం పలువురు ఉన్నతస్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను కలుస్తారు.
జపాన్ పర్యటన ముగింపుకుని ఆగస్టు 31న మోడీ చైనాకు చేరుకుంటారు. టియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో సమ్మిట్‌లో పాల్గొననున్నారు. శిఖరాగ్ర సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో మోడీ సమావేశం కానున్నారు. సరిహద్దులో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్తున్నారు. చైనాలో జరిగే సమ్మిట్‌కు 11 దేశాల నేతలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానించారు. ఇక ఇందులో ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఉన్నారు. ఈ సమ్మిట్‌కు ఎస్‌సీవో దేశాలతో పాటు నేపాల్, మాల్దీవులు, తుర్కియే, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కంబోడియా, మంగోలియా, తుర్క్‌మెనిస్తాన్, లావోస్, అర్మేనియా, అజర్‌బైజాన్ నాయకులంతా సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. చైనాలో టూర్‌లో భాగంగా తొలిసారి జిన్‌పింగ్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.