Kaziranga National Park: కజిరంగా పార్కులో ప్రధాని..
ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ;
ప్రధాని నరేంద్రమోదీ అసోంలోని ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్కును సందర్శించారు. ఏనుగుపై అధిరోహించి...పార్కు అందాలను ఆస్వాదించారు. ఆ తర్వాత గజరాజులకు చెరకు గడలను తినిపిస్తూ ప్రకృతి ఒడిలో సేదతీరారు. వివిధ రకాలైన జంతు, వృక్షజాతులను చూసి అబ్బురపోయారు. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించి... వాటిని ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ఏనుగుపై సవారీ చేశారు. అసోంలోని కజిరింగా జాతీయ పార్కు సందర్శించిన ఆయన... ఏనుగుపై అధిరోహించి ప్రకృతి అందాలను వీక్షించారు. టైగర్ రిజర్వులో జీపులో సఫారీకి వెళ్లారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కజిరంగా పార్కులో తొలిసారి పర్యటిస్తున్న ప్రధాని...సెంట్రల్ కొహొరా రేంజ్‌లోని మిహిముఖ్ ప్రాంతంలో మొదట గజరాజును అధిరోహించారు. మెడలో కెమెరాను ధరించి ప్రకృతి సోయగాలను బంధించారు. ఆ తర్వాత అదే రేంజ్‌లో జీపులో సఫారీ చేశారు. పార్కు డైరెక్టర్‌తోపాటు సీనియర్ అధికారులు మోదీ వెంట ఉన్నారు.
కజిరంగా జాతీయ పార్కు అందాలను ప్రధాని మోదీ కొనియాడారు. తన అనుభూతులను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. లఖిమై, ప్రద్యుమ్న, పూల్మయి అనే గజరాజులకు చెరకు గడలు తినిపించానంటూ ...కొన్ని ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేశారు. కజిరంగా పార్కు ఖడ్గమృగాలకు పేరుగాంచిందని, అయితే ఇక్కడ భారీ సంఖ్యలో ఏనుగులు, వివిధ రకాలైన వృక్షజాతులు, జీవజాతులు ఉన్నాయని వివరించారు. ఔత్సాహికులు ప్రఖ్యాత కజిరంగా పార్కును సందర్శించి ప్రకృతి అందాల్ని ఆస్వాదించటంతోపాటు అసోం ప్రజల ఆతిథ్యం స్వీకరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రెండురోజుల పర్యటన కోసం శుక్రవారం అసోంకు వెళ్లిన ప్రధాని మోదీ...కజిరంగా నేషనల్ పార్కుకు సందర్శించారు.