Modi-Meloni | మెలోనీ ఆత్మకథకు మోదీ ముందుమాట

మరోసారి తెరపైకి ‘మెలోడీ’ మూమెంట్‌

Update: 2025-09-29 06:30 GMT

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆత్మకథ ‘అయాం మెలోని.. మై రూట్స్, మై ప్రిన్సిపల్స్’ 2021లో తొలిసారి మార్కెట్లోకి విడుదలై అప్పట్లో బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఈ పుస్తకాన్ని మెలోని ఇటీవల అమెరికాలోనూ రిలీజ్ చేశారు. తాజాగా తన ఆత్మకథ పుస్తకాన్ని ఇండియన్ వెర్షన్ రూపొందించి భారత్ లో విడుదల చేయడానికి ఆమె ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పుస్తకంలో మెలోనీ తాను ఎదుర్కొన్న సవాళ్లు, ఎన్నికల ప్రచార సమయంలో గర్భిణిగా, అవివాహితురాలైన తల్లిగా ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు.

ప్రధాని మోదీ, మెలోని మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై వారిద్దరూ కలుసుకొన్నప్పుడు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే మెలోని పుస్తకానికి ప్రధాని నరేంద్ర మోదీ ముందుమాట రాశారు. మెలోని ఆత్మకథను ‘హర్ మన్ కీ బాత్’ గా మోదీ అభివర్ణించారు. మెలోని పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం లభించడం తనకు గొప్ప గౌరవమని మోదీ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. “ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని జీవితం, నాయకత్వం కాలంతో సంబంధంలేని సత్యాలను మనకు గుర్తుచేస్తాయి. ఈ ఉత్తేజకర జీవిత చరిత్రకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుంది’’ అని రాసుకొచ్చారు.

సాంస్కృతిక వారసత్వం, సమానత్వంపై ఆమెకు అమితమైన విశ్వాసం ఉందని కొనియాడారు. కాగా, మోదీ, మెలోనిలు ఎప్పుడు కలిసి ఫొటోలు దిగినా అవి నెట్టింట వైరల్ గా మారుతుంటాయి. దుబాయ్‌ వేదికగా జరిగిన ‘కాప్‌ 28’ సదస్సు వేదికపై సెల్ఫీ తీసుకున్న మోదీ, మెలోని.. ఆ ఫొటోను ఎక్స్ లో షేర్ చేస్తూ వారిద్దరి పేర్లు కలిసేలా ‘మెలోడి’ అంటూ హ్యాష్ ట్యాగ్ జతచేశారు. అప్పటి నుంచి మెలోడి ట్రెండింగ్ గా మారింది.

Tags:    

Similar News