J&K Election 2024: జమ్మూ కాశ్మీర్‌లో నేడు ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూలో ఎన్నికలు..;

Update: 2024-09-14 02:30 GMT

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కశ్మీర్ లో నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ పలు సభల్లో పాల్గొననున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించే ఛాన్స్ కూడా ఉంది. గత 45 ఏళ్లలో జమ్మూలోని దోడాలో ఓ ప్రధాని బహిరంగ సభ పెట్టడం ఇదే తొలిసారి. ఒకప్పుడు ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న దోడా జిల్లాను ఇప్పుడు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దోడ జిల్లాలో రెండు గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. దోడాతో పాటు చుట్టుపక్కల ఎనిమిది స్థానాలను గెలుచుకోవడానికి బీజేపీ తన వ్యూహాలు రచిస్తుంది. జమ్మూ కశ్మీర్ లోని మొత్తం 90 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. తొలిదశలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండు, మూడు దశల్లో వరుసగా 26, 40 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. సెప్టెంబరు 18వ తేదీన తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత పోలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. అక్టోబరు 4వ తేదీన తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Tags:    

Similar News