POLITICS: తమిళ రాజకీయాల్లో 'సినిమా నాయకత్వం'
తమిళనాడు రాజకీయాల రూట్లు తెర వెనక సినిమా తారల నుంచి తెరపై నాయకుల వరకూ సాగినవే.;
తమిళనాడు రాజకీయాల రూట్లు తెర వెనక సినిమా తారల నుంచి తెరపై నాయకుల వరకూ సాగినవే. తెరమీద నిలిచిన అధినేతల పిలుపుతో ప్రజల ఓటు బ్యాంకులు మారిపోయిన సందర్భాలు ఎన్నో. అయితే ఇప్పుడు మరోసారి అదే చర్చ. ఈసారి తెరపై ఉన్నది 'దళపతి' విజయ్.. రాజకీయ తెరపైకి సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి నాయకులు తమ సినీ పునాదులతో ప్రజల్లో నమ్మకం ఏర్పరచుకోగలిగారు. వారు నటించిన పాత్రలు, మాట్లాడిన డైలాగులు ప్రజల జీవితాలను నాటకీయంగా ప్రభావితం చేశాయి. 1967 లో అన్నాదురై ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఓడిపోవడమే ఇందుకు శ్రీకారం. తర్వాత ఎంజీఆర్ సినిమా ఇమేజ్ ఆధారంగా మూడు సార్లు సీఎం కుర్చీ అధిరోహించారు. అయితే అన్ని స్టార్లు రాజకీయంగా విజయం సాధించలేదు. శివాజీ గణేషన్, విజయ్ కాంత్, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి వారు ప్రజల్లో అభిమానాన్ని మూటగట్టుకున్నా, ఓటర్ల మద్దతు మాత్రం పొందలేకపోయారు. ఇవన్నీ "ప్రముఖత వేరు.. ప్రభావితం వేరు" అనే వాస్తవాన్ని రుజువు చేశాయి.
విజయ్‌కు పరీక్ష
ఇప్పుడు విజయ్ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన వేళ ఆయన ముందు రెండు పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి అభిమానంతో గెలుపు సాధ్యమేనా? రెండు డీఎంకే–అన్నాడీఎంకే మధ్య రాజకీయంగా విసిగిన ప్రజలు ప్రత్యామ్నాయాన్ని సిద్ధంగా చూస్తున్నారా? అని. విజయ్ కు యువతలో పాపులారిటీ ఉంది. సినిమా ద్వారా రాజకీయ చైతన్యం కలిగించేందుకు చేసిన ప్రయత్నాలు గుర్తింపు పొందుతున్నాయి. 'మెర్సల్', 'సర్కార్' వంటి సినిమాల్లో ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతిపై నిబద్ధత స్పష్టంగా కనబడింది. అయితే రాజకీయ అనుభవం లేనిదే, పార్టీ కేడర్ స్థిరంగా లేకుండా అసెంబ్లీ లెవెల్ పోటీ ఎలా జరగనుందన్నది అసలైన పరీక్ష.
పునాది ద్రవిడ వాదమే
తమిళనాడులో రాజకీయ సామాజిక చైతన్యానికి పునాది ద్రవిడవాదమే. సామాజిక న్యాయం, ప్రాంతీయ గర్వం, స్థానిక సమస్యల పట్ల స్పష్టమైన వైఖరి లేకుండా రాజకీయ పట్టు సాధ్యం కాదు. ప్రజలకు ఇప్పుడు కావలసింది ‘హీరో’ కాదు .. హేతుబద్ధ నాయకుడు. సమస్యలు వినే నేత, పరిష్కారాలు సూచించే వ్యక్తిత్వం. విజయ్ ముందున్న దారి గులాబీ పువ్వులతో కాదు.. అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత, వంటి అంశాలతో నిండి ఉంది. ఆయన ఆగమనం రాజకీయంగా కొత్త అధ్యాయాన్ని తెరిచినా, అది విజయవంతం అవుతుందా లేదా అనేది.. ప్రజల హృదయాల్లో స్థిరపడే సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ఇది ఒక స్టార్ పవర్ కాదు .. ప్రజా నమ్మకం గెల్చుకునే పోరాటం. ఇదే విజయ్ కు నిజమైన సవాల్.
జయలలిత
కన్నడ నటి జయలలిత తమిళ రాజకీయాల్లో పెను సంచలనం. మొదట ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీలో చేరారామె. ఎంజీఆర్ మరణానంతరం ఎన్నో సమస్యలు ఎదురైనా తన బలమైన నాయకత్వంతో మళ్లీ పార్టీ సభ్యులను కూడగట్టి పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. జయలలిత తమిళనాడుకు ఆరుసార్లు సీఎంగా ఉన్నారు.
విజయకాంత్
నటుడు విజయకాంత్ 2005లో పార్టీని స్థాపించారు. 2011లో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. అయితే ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆయన పార్టీ తన చరిష్మాను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. దీంతో జయలలితతో విభేదాలు కూడా వచ్చాయి. విజయ కాంత్ గతేడాది డిసెంబర్ 28న కన్నుమూశారు.
కమల్ హాసన్
నటుడు కమల్ హాసన్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారాయన. 2018లో కమల్ హాసన్ ‘మక్కల్ నిధి మాయం’ పార్టీని స్థాపించారు. 2019 లోక్‌సభ ఎన్నికలను ఆయన ఎదుర్కొన్నారు. కానీ గెలవలేదు. ఇప్పటికీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు లోకనాయకుడు.
ఖుష్బు
కన్నడతో పాటు పలు భాషా చిత్రాల్లో నటించిన నటి ఖుష్బు గత 14 ఏళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు.
దళపతి విజయ్
తమిళ ప్రస్తుత స్టార్ నటుడు దళపతి విజయ్ ఇంతస్తే (ఫిబ్రవరి 2) తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. విజయ్ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయనున్నారని తెలుస్తోంది.