Pollution Updates:

Update: 2023-11-05 02:00 GMT

దేశ రాజధాని ఢిల్లీ వాసులకు చలికాలం వచ్చిందంటే చాలు ఓ విధమైన భయం వెంటాడుతుంటుంది. గడ్డకట్టే చలికి భయపడి కాదు. వాతావరణంలో కాలుష్యం అంతగా భయపడుతుంటుంది. ప్రతి యేటా ఇదే సమస్య ఎదురౌతున్నా శాశ్వత పరిష్కారం ఉండటం లేదు. వాయు కాలుష్యం ఈసారి భారీగా పెరిగిపోవడంతో గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో విషపూరితమైన గాలి ఆస్తమా, శ్వాసకోశ రోగులకు టెన్షన్‌ను పెంచింది. దీపావళికి ముందే ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. న్యూఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో తెల్లవారుజామున 1 గంటలకు గాలి నాణ్యత సూచిక (AQI) స్థాయి 999 వద్ద నమోదైంది. ఇతర ప్రాంతాలలో కూడా కాలుష్యం కారణంగా పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. 


వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం ప్రస్తుతం వర్షాలు కురిసే అవకాశం లేదు. కాలుష్యం నుండి ఉపశమనం పొందే ఆశ లేదు. పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాలుష్యాన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వ చర్యలు సరిపోవు. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ సహా NCR లోని అన్ని ప్రాంతాలలో ఉదయం పూట ఆకాశంలో పొగమంచు ఉంది. దీని కారణంగా రోడ్లపై విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా గ్రాప్- 3ని కూడా అమలులోకి తీసుకువచ్చారు. దేశ రాజధానిలో కాలుష్య స్థాయి ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకోవడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పలు నిర్మాణ పనులను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు నిలిపివేశారు. డీజిల్‌తో నడిచే ట్రక్కులను దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) ఉత్తర్వులు జారీ చేసింది.

కాలుష్య నియంత్రణలో గ్రాప్‌-3 అనేది మూడవ దశలో భాగం. ఇది చలికాలంలో ఢిల్లీ అంతటా అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించిన వాయు కాలుష్య నిర్వహణ వ్యూహం. గ్రాప్‌ అనేది నాలుగు దశలుగా విభజించిన విధానం. వీటిని ‘పూర్’ (ఏక్యూఐ 201-300), ‘వెరీ పూర్’ (ఏక్యూఐ 301-400), ‘తీవ్రమైన’ (ఏక్యూఐ 401-450), ‘మరింత తీవ్రమైన’ (ఏక్యూఐ >450)వర్గాలుగా పేర్కొన్నారు. గ్రాప్‌ స్టేజ్-3లో కీలకమైన ప్రభుత్వ ప్రాజెక్టులు, ముఖ్యమైన మైనింగ్, స్టోన్ బ్రేకింగ్ కార్యకలాపాలు మినహా అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తారు. ఢిల్లీకి బయట రిజిస్టర్ అయిన వాణిజ్య వాహనాలతో పాటు డీజిల్‌తో నడిచే ట్రక్కులు, మధ్యస్థ, భారీ కంటెయినర్‌ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధించారు.

Tags:    

Similar News