Kedarnath: తెరచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు

యాత్రికుల‌కు వెల్క‌మ్ చెప్పిన సీఎం ధామి;

Update: 2025-05-02 04:00 GMT

దేవభూమిగా భాసిల్లుతున్న ఉత్తరాఖండ్‌లో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి శ్రీ కేదార్‌నాథ్ ధామ్‌. జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారనాథుడిని దేశం నలుమూలల నుంచి ఏటా లక్షలాదిమంది దర్శించుకుంటుంటారు. భారీ మంచు కార‌ణంగా సుదీర్ఘ‌కాలం మూసి ఉండే ఈ పుణ్య‌క్షేత్రం ఈరోజు తెరుచుకుంది. ఇవాళ‌ ఉదయం సరిగ్గా 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ఆలయం తలుపులను తెరిచారు.

ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌పై హెలికాప్ట‌ర్ ద్వారా పూల వ‌ర్షం కురిపించారు. తలుపులు తెరచుకోనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పూలతో అందంగా అలంకరించారు. దీనికోసం 13 టన్నుల పూలను వినియోగించారు.

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ వేడుకలకు విచ్చేసి, కేదారనాథుడికి తొలి పూజలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి భ‌క్తుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 6 నెలల కిందట ఆలయం తలుపులను మూసివేసే సమయంలో మూలమూర్తికి అలంకరించిన పూజా వస్తువులను తొలగించారు. తాజా పూలతో స్వామివారిని అలంకరించారు. ఆ తరువాత అఖండ జ్యోతిని దర్శనం చేసుకున్నారు.

కేదార్‌నాథ్ ఆలయం తలుపు తెరుచుకోవడంతో చార్ ధామ్ యాత్ర సీజన్ ప్రారంభమైనట్టయింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు. యమునోత్రి, గంగోత్రి ధామాలు ఏప్రిల్ 30న‌ అక్ష‌య తృతీయ రోజున తెర‌వ‌గా, బద్రీనాథ్ ఆల‌యాన్ని ఈ నెల 4న తెర‌వ‌నున్నారు. కాగా, కేదార్‌నాథ్ యాత్ర కోసం సోన్‌ప్ర‌యాగ్ నుంచి హెలికాప్ట‌ర్ సేవ‌లు ప్రారంభ‌మ‌య్యాయి.

ఇటీవ‌ల జ‌మ్మూక‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఈ చార్‌ధామ్ యాత్ర కొన‌సాగే మార్గంలో పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అనుమానిత వ్య‌క్తులు క‌నిపిస్తే వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని భ‌క్తుల‌కు అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News