Ladakh Violence: లద్ధాఖ్‌లో ఆందోళనలు.. 50 మంది అరెస్ట్
రాష్ట్రహోదా కోసం నిరసనలు
లద్ధాఖ్ కి రాష్ట్రహోదా కల్పించడంతోపాటు, ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు బుధవారం లెహ్‌లో నిర్వహించిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు స్థానిక బీజేపీ కార్యాలయాన్ని, ఓ వాహనాన్ని తగలబెట్టి, విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ నిరసనల్లో నలుగురు మరణించగా, 90 మందికిపైగా గాయపడ్డారు. లెహ్ నగరంలో అధికారులు కర్ఫ్యూ విధించారు.
బుధవారం జరిగిన హింసలో పాల్గొన్న వారందరిపై చర్యలు తీసుకోవాలన్న లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం తెల్లవారుజామున లెహ్‌లో పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో అల్లర్లలో పాల్గొన్న 50 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు లెహ్ నగరంలో అధికారులు కర్ఫ్యూ విధించారు. సీఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసులతో పాటూ శాంతి భద్రతలను కాపాడేందుకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులను మోహరించారు. మరోవైపు కార్గిల్‌లోనూ ఆంక్షలు విధించారు.