ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూటు.. వైద్యుడిపై సస్పెన్షన్ వేటు
పిచ్చి పీక్స్ లో ఉంటే ఇలాంటి పన్లే చేస్తారు.. పెళ్లి చేసుకున్నాక కాపురం సరిగా చేస్తారో లేదో కాని.. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ;
పిచ్చి పీక్స్ లో ఉంటే ఇలాంటి పన్లే చేస్తారు.. పెళ్లి చేసుకున్నాక కాపురం సరిగా చేస్తారో లేదో కాని.. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు ఒక్కోసారి అవి బెడిసి కొడుతుంటాయి. నెటిజన్ల చేతిలో చీవాట్లు తినాల్సి వస్తుంది.. అయినా కోరుకున్న పబ్లిసిటీ అయితే వచ్చింది కదా అనుకుంటారు సదరు పెళ్లికుమార్తె, పెళ్లి కొడుకు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఏకంగా వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి ఆ వైద్యుడిని సస్పెండ్ చేసింది.
ఇంతకీ ఆ వైద్యుడు చేసిన ఘనకార్యం ఏంటో తెలుసుకుందాం.. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్న డా. అభిషేక్ కాబోయే భార్యతో కలిసి ఓ వ్యక్తికి ఆపరేషన్ చేస్తున్నట్లుగా ఫోటోలు, వీడియోలు తీయించుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దేనేశ్ కంట పడింది. అంతే ఆపరేషన్ అంటే అల్లాటపాగా ఉందా.. వైద్య వృత్తిని కించ పరిచేలా ఉంది నువు చేసిన పని.. ప్రీ వెడ్డింగ్ షూట్ కి ఆపరేషన్ థియేటరే దొరికిందా అని సదరు డాక్టర్ గారికి నాలుగు చీవాట్లు పెట్టి సస్పెండ్ చేసి పడేశారు. వైద్యుడిని విధుల నుంచి తొలగించి ఇంటికి పంపించారు.
"ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఉన్నాయి. వ్యక్తిగత పని కోసం కాదు. డాక్టర్ల నుండి ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని నేను సహించలేను" అని మంత్రి X లో పోస్ట్ చేశారు.
"ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందితో సహా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ ప్రభుత్వ సేవా నిబంధనల ప్రకారం తమ విధులను నిర్వహించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి దుర్వినియోగాలు జరగవని, ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సామాన్యుల ఆరోగ్య సంరక్షణ కోసమేనని తెలుసుకుని విధి నిర్వహణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని మంత్రి స్ లో పేర్కొన్నారు.