ED Raids: రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఎమ్మెల్యేల ఇళ్లపై ఈడీ దాడులు

టీచ‌ర్ రిక్రూట్మెంట్ పేప‌ర్ లీక్ కేసులో;

Update: 2023-10-26 06:00 GMT

రాజ‌స్థాన్‌లో  ఈడీ ప‌లు ప్ర‌దేశాల్లో సోదాలు  చేస్తోంది. ప్ర‌భుత్వ స్కూల్ టీచ‌ర్ల రిక్రూట్మెంట్ ప‌రీక్షా పేప‌ర్ల లీకేజీ కేసుతో లింకున్న వారి ఇండ్ల‌ల్లో ఈడీ త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ గోవింద్ సింగ్ దోత‌సారా ఇంట్లో కూడా ఈడీ సోదాలు చేస్తోంది. మ‌రో ఆరు ప్ర‌దేశాల్లోనూ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌లకు రాజ‌స్థాన్ ఒక‌వైపు రెఢీ అవుతుండ‌గా.. అక‌స్మాత్తుగా ఈడీ త‌న జోరు పెంచింది. కాంగ్రెస్ నేత‌ల ఇండ్ల‌పై త‌నిఖీలు చేస్తోంది. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ హడ్లా నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. పేపర్ల లీక్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు చెందిన 11 ప్రాంతాల్లో సోదాలు చేశారు.

గ‌త వారం ఈడీ నిర్వ‌హించిన సోదాల్లో 12 ల‌క్ష‌ల న‌గ‌దు ల‌భ్య‌మైంది. ఏడు చోట్ల నిర్వ‌హించిన త‌నిఖీల్లో ప‌లు కీల‌క‌మైన డాక్యుమెంట్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత దినేశ్ ఖోద‌నియా ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేప‌ట్టారు. ప్ర‌భుత్వ స్కూల్ టీచ‌ర్ల ప‌రీక్ష పేప‌ర్ లీకేజీపై న‌మోదు అయిన కేసులు ఆధారంగా ఈడీ ద‌ర్యాప్తు మొద‌లుపెట్టింది. ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల‌కు పేప‌ర్‌ను ప‌ది ల‌క్ష‌ల‌కు అమ్ముకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  పేపర్ల లీక్ కేసులో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు బాబులాల్ కటారా, మరో వ్యక్తి అనిల్ కుమార్ మీనాలను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

అలాగే తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కుమారుడు వైభవ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్కు ఈ సమన్లు అందినట్లు తెలిసింది. ఈ కేసులో వైభవ్ను ప్రశ్నించేందుకు అక్టోబరు 27న దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఈడీ పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈడీ ఇలా సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహోత్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. "అక్టోబరు 25న, రాజస్థాన్ మహిళల కోసం కాంగ్రెస్ హామీలు ప్రకటించింది. ఆ మరుసటి రోజు అక్టోబరు 26న రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్పై ఈడీ దాడులకు దిగింది. నా కుమారుడు వైభవ్కు సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో మహిళలు, రైతులు, పేదలు కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రయోజనాలను పొందాలని బీజేపీ కోరుకోవడం లేదు. అందుకే ఇలా ఈడీతో ఇలా 'ఎర్ర గులాబీలు' పంపిస్తోందని నేను చాలా సార్లు చెప్పాను. నా మాటలు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటాయి" అని గహ్లోత్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Tags:    

Similar News