Pune Bus Incident : పుణె లైంగిక దాడి నిందితుడి అరెస్ట్‌

100 మంది పోలీసులు, డ్రోన్లు, జాగిలాలు.. 75 గంటల వేట..;

Update: 2025-03-01 01:30 GMT

 పుణె బస్సు ఘటన.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బస్సులో మహిళపై లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. స్వర్‌గేట్ బస్ స్టేషన్‌లో బస్సు కోసం చూస్తున్న యువతిపై లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడు దత్తాత్రేయ రాందాస్‌ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. వెంటాడి మరీ అతడిని పట్టేశారు. ఇందుకోసం 75 గంటలు వేట సాగింది. డ్రోన్లు వినియోగించారు. జాగిలాలను వాడారు. చివరికి కిరాతకుడిని పట్టుకున్నారు. శ్రీరూర్ తెహ్ సిల్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మంగళవారం ఉదయం బస్సులో యువతిపై లైంగిక దాడి జరిగింది. స్వర్ గేట్ బస్ స్టాండ్.. పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో అతిపెద్ద బస్ డిపోలలో స్వర్ గేట్ ఒకటి. ఉదయం 5 గంటల 45 నిమిషాలు – 6 గంటల మధ్య యువతిపై లైంగిక దాడి జరిగింది. సతారా జిల్లాలోని తన ఇంటికి వెళ్లేందుకు ఆమె బస్సు కోసం బస్టాండ్ లో ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది.

ఒంటరిగా ఉన్న యువతిపై ఆ నీచుడి కన్ను పడింది. ఆమె దగ్గరికి వెళ్లాడు. అక్క అని పిలిచాడు. ఆమెతో మాటలు కలిపాడు. సతారాకు వెళ్లే బస్సు మరో ప్లాట్ ఫామ్ దగ్గరకు వచ్చిందని ఆమెతో చెప్పాడు. ఆ తర్వాత యువతిని ఖాళీ బస్సులోకి తీసుకెళ్లాడు. అయితే, ఆ బస్సు చీకటిగా ఉంది. అందులో లైట్లు లేవు. దీంతో ఆ బస్సు ఎక్కేందుకు యువతి నిరాకరించింది.

అయితే, సతారాకు వెళ్లే బస్సు అదేనని, ప్రయాణికులు పడుకుని ఉన్నారని, అందుకే లైట్లు వేయలేదని నిందితుడు ఆమెను నమ్మించాడు. అతడి మాటలు నమ్మేసిన యువతి ఆ ఖాళీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన వెంటనే నిందితుడు లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఉండే బస్టాండ్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం వేట ప్రారంభించారు. 13 పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. 100 మంది పోలీసులు నిందితుడి స్వగ్రామం గునత్ గ్రామం, చెరుకు తోటలలో జల్లెడ పట్టారు.mసెర్చ్ ఆపరేషన్ లో డ్రోన్లు వాడారు. డాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దింపారు. నిందితుడు తప్పించుకున్న మార్గాన్ని జాగిలాలు పసిగట్టాయి. చివరికి బంధువుల ఇంటి సమీపంలో ఓ కాల్వ పక్కన చెరుకు తోటలో అతను దాక్కున్నట్టు జాగిలాలు గుర్తించాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పుణెలోని గునత్ గ్రామానికి చెందిన నిందితుడు.. తాను పోలీస్ అని చెప్పుకుని తిరిగే వాడు. అతడిపై పలు కేసులు ఉన్నాయి. శ్రీరూర్, షికార్‌పూర్‌ సహా పలు స్టేషన్లలో ఆరు కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. చోరీ, చైన్ స్నాచింగ్, దోపిడీ కేసులు కూడా రాందాస్‌పై ఉన్నాయి. 2019లో లోన్ తీసుకుని కారు కొనుగోలు చేసిన నిందితుడు పుణె-అహిల్యానగర్ రూట్‌లో నడిపేవాడు. వృద్ధులను లక్ష్యంగా చేసుకునేవాడు. లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కించుకుంటాడు. తర్వాత వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి నగలు, డబ్బు దోచుకునే వాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు.

Tags:    

Similar News