Punjab Bandh: రైతు నాయకుడు ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా నేడు పంజాబ్ బంద్
మద్దతు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, బస్సులు, ట్రైన్స్, దుకాణదారులు;
రైతు డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతు సంఘాలు సోమవారం పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చాయి. పాలు, పండ్లు, కూరగాయలు వంటి నిత్యావసరాలతో పాటు రోడ్డు, రైలు మార్గాలను పూర్తిగా దిగ్బంధించి పూర్తిస్థాయిలో బంద్ నిర్వహించడానికి రైతు సంఘాలు సన్నద్ధమయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ ఉదయం 7 .00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ఈ బంద్‌కు సహకరించాలని ప్రజలకు కోరారు. రాష్ట్రంలో ప్రజలకు పాలు, కూరగాయలు తదితర నిత్యవసర వస్తువులు సరఫరా చేయబోమన్నారు. అలాగే, రహదారులపై వాహనాలు, రైళ్లను సైతం తిరగనివ్వమని తేల్చి చెప్పారు. ఈ రైతుల బంద్‌కు వాణిజ్య సంస్థలు సైతం సపోర్టు ఇచ్చాయి.
కాగా, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు బంద్‌కు సపోర్టుగా మూసి ఉంచాలని రైతు సంఘాల నేతలు కోరారు. అయితే, అంబులెన్స్‌లు, పెళ్లి వాహనాలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రాక పోకలు సాగించే వారికి మాత్రం పర్మిషన్ ఉంటుందన్నారు. నేటి ‘పంజాబ్ బంద్’కు పిలుపునివ్వాలని గత వారం సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్)తో పాటు కిసాన్ మజ్దూర్ మోర్చా నిర్ణయించారు. దీంతో ఈ బంద్‌కు వ్యాపారులు, ఉద్యోగ సంఘాలు, కార్మికులతో పాటు వివిధ వర్గాల వారు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
అయితే, తాము పండించే పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించాలని.. 101 మంది రైతులు గత కొంత కాలంగా పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల్లో శంభు సరిహద్దు వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలిపేందుకు పలుమార్లు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకోవడంతో.. వచ్చే ఏడాది జనవరి 4న ఖౌనౌరీ నిరసన ప్రదేశంలో కిసాన్ మహాపంచాయత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టాలని ప్రకటించారు.