Amit Sehra: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన పేద వ్యాపారి
స్నేహితుడి సాయంతో మారిన తలరాత..
అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేము. రాత్రికి రాత్రే ఓ సామాన్యుడిని కోటీశ్వరుడిగా మార్చేసింది. తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించే ఓ పేద వ్యాపారి తలరాతను లాటరీ టికెట్ మార్చేసింది. స్నేహితుడి దగ్గర అప్పు చేసి కొన్న టికెట్‌కు ఏకంగా రూ.11 కోట్ల జాక్‌పాట్ తగిలింది. పంజాబ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా కోట్‌పుత్లికి చెందిన అమిత్ సెహ్రా బతుకుదెరువు కోసం తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతుంటాడు. ఇటీవల పంజాబ్ పర్యటనకు వెళ్లిన ఆయన, భటిండాలోని ఓ దుకాణంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే "దీపావళి బంపర్ 2025" లాటరీ టికెట్‌ను చూశాడు. దానిని కొనడానికి తన వద్ద డబ్బు లేకపోవడంతో, తన స్నేహితుడి వద్ద అప్పు తీసుకుని కొనుగోలు చేశాడు. అక్టోబర్ 31న లాటరీ డ్రా ఫలితాలు వెలువడగా.. అమిత్ కొన్న టికెట్‌కే మొదటి బహుమతి అయిన రూ.11 కోట్లు దక్కింది.
ఈ విషయం తెలుసుకున్న అమిత్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన సంతోషాన్ని పంచుకుంటూ, "లాటరీ బహుమతి అందుకోవడానికి చండీగఢ్ వెళ్లేందుకు కూడా నా దగ్గర డబ్బుల్లేని పరిస్థితి. దేవుడే కరుణించి 'చప్పర్ ఫాడ్ కే' (ఊహించని విధంగా భారీ బహుమతి) ఇచ్చాడు" అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
లాటరీలో గెలిచిన ఈ డబ్బును తన ఇద్దరు పిల్లల చదువుల కోసం వినియోగిస్తానని అమిత్ తెలిపాడు. అంతేకాకుండా, కష్టకాలంలో లాటరీ టికెట్ కొనడానికి డబ్బులిచ్చి ఆదుకున్న తన స్నేహితుడు ముఖేశ్‌కు రూ.1 కోటి ఇస్తానని ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అదృష్టం, స్నేహితుడి సాయం తన జీవితాన్నే మార్చేశాయని సంతోషం వ్యక్తం చేశాడు.