Radhika Yadav: రాధిక హత్యపై వరుస వీడియోలు విడుదల చేస్తున్న స్నేహితురాలు.
సంచలన విషయాలు వెల్లడించిన హిమాన్షిక;
రాధిక యాదవ్.. టెన్నిస్ క్రీడాకారిణి. కన్న తండ్రి అత్యంత దారుణంగా చంపేశాడు. ఇంట్లోనే తుపాకీతో కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్య సమయంలో రక్తసంబంధులందరూ ఇంట్లోనే ఉన్నా.. ఏ మాత్రం పట్టించుకోలేదు. చివరికి రాధిక మామ వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.
అయితే రాధిక యాదవ బెస్ట్ ఫ్రెండ్ హిమాన్షిక సింగ్ పుజ్‌పుత్ కీలక విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. మొదటి వీడియోలో తల్లిదండ్రులు విధించిన ఆంక్షలు, కట్టుబాట్లు గురించి వివరించగా.. రెండో వీడియోలో మరిన్ని విషయాలను వెలుగులోకి తెచ్చింది. హత్యకు ముందు రాధిక తీవ్ర మానసిక క్షోభను ఎదుర్కొందని చెప్పింది. ఇంట్లో పూర్తిగా ప్రశాంతతను కోల్పోయిందని ఆరోపించింది. చివరికి ఇంట్లో పెట్టే ఆంక్షలకు రాధిక తలొగ్గిందని.. నిబంధనల ప్రకారం జీవించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు రాధిక తన తండ్రికి చెప్పిందని వివరించింది. అయినప్పటికీ.. రాధికను చంపేయాలని తండ్రి ముందే నిర్ణయించుకోవడంతో చంపేసినట్లు వివరించింది. రాధిక చాలా మంచి అమ్మాయి అని.. తండ్రి మతిస్థిమితం లేనివాడని.. ముఖంలో ఎటువంటి భావాలు లేవని హిమాన్షిక చెప్పుకొచ్చింది.
ఇక మొదటి వీడియోలో హిమాన్షిక కీలక విషయాలు వెల్లడించింది. రాధిక ఏం చేసినా తన తల్లిదండ్రులకు చెప్పాల్సి వచ్చేదని.. వ్యక్తిగత స్వేచ్ఛ ఆమెకు లేదని వాపోయింది. ఇక తల్లిదండ్రుల మీద ఇష్టంతో తనకు ఇష్టమైన పనులు చేయడం కూడా మానేసిందని వివరించింది. ఫొటోలు తీయడం, వీడియోలు తీయడం మానేసిందని చెప్పింది. అనేక కట్టుబాట్లతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారని తెలిపింది.
ఇక హిమాన్షిక ఆరోపణలను రాధిక కుటుంబం తోసిపుచ్చింది. ఒకవేళ ఆంక్షలు పెట్టి ఉంటే.. ఇంట్లో నుంచి బయటకు అడుగు కూడా పెట్టలేకపోయేదని రాధిక బంధువు వెల్లడించారు. రాధిక కోసం కుటుంబం చాలా డబ్బు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని బంధువు పేర్కొన్నారు.
అయితే రాధిక పెళ్లి విషయంలో తండ్రి దీపక్ యాదవ్ చాలా కలత చెందినట్లుగా సమాచారం. రాధిక.. కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన సంబంధం కాకుండా.. వేరే కులం అబ్బాయిని వివాహం చేసుకుంటానని తెగేసి చెప్పింది. అయితే వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కుటుంబ పరువు పోతుందని ఘర్షణ జరిగింది. అందుకు రాధిక అంగీకరించలేదని.. ఆ కోపంతోనే దీపక్ యాదవ్ ఘాతుకానికి పాల్పడినట్లు పొరుగింటి వ్యక్తి మీడియాకు వెల్లడించాడు.