Rahul Gandhi: హత్రాస్ బాధితులకు రాహుల్ గాంధీ పరామర్శ
బాధితులకు అండగా ఉంటామని హామీ;
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ దుర్ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు. ఈ నెల 2న హత్రాస్ జిల్లాలోని పూల్‌రాయ్ గ్రామంలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 121 మంది మరణించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం హత్రాస్‌లో పర్యటించిన రాహుల్.. బాధిత కుటుంబాలను ఓదార్చారు. అలీఘర్‌లోని పిల్ఖానాలో ఛోటే లాల్ భార్య మంజు, ఛోటే లాల్ కుమారుడు పంకజ్, ప్రేమవతి, ప్రమాదంలో మరణించిన విజయ్ సింగ్ భార్య శాంతి దేవి కుటుంబాలను కలుసుకున్నారు. వారిని పరామర్శించారు.
కాగా, భోలే బాబా అనే పేరుతో ప్రాచూర్యం పొందిన ఓ ఆధ్యాత్మికవేత్త హత్రాస్ జిల్లాలోని ఫూల్‌రాయ్ గ్రామంలో మంగళవారం ‘సత్సంగ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు, అనుచరులు హాజరయ్యారు. వారిని ఉద్దేవించి భోలే బాబా తన ప్రవచనాన్ని ఇచ్చారు. కార్యక్రమం పూర్తవుతుండగా ఒక్కసారిగా పెనుగులాట చోటుచేసుకుంది. అనేక మంది కింద పడిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కింద పడ్డ వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఊపిరి అందక ఆర్తనాదాలు చేస్తూ చాలామంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇక, ఈ ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ న్యాయ విచారణకు ఆదేశించారు. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారు సాక్ష్యాలను దాచిపెట్టారని, నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఇక, ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ బుధవారం హత్రాస్‌ను సందర్శించి ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించారు. ఈ ప్రమాదానికి కారణమైన భోలే బాబా పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
సత్సంగ్ ముగుస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. భోలే బాబా వెళ్తుండగా ఆయనను దగ్గరగా దర్శనం చేసుకునేందుకు, ఆయన పాదాలు తాకేందుకు, ఆయన పాదాలు తాకిన మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. కార్యక్రమానికి నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని, ఊహించిన దాని కంటే ఎక్కువ భక్తులు రావడం, కార్యక్రమం జరిగిన ప్రాంతంలో నేల చిత్తడిగా మారడం కూడా తొక్కిసలాటకు కారణమని పలువురు తెలిపారు. కాగా, ఈ ప్రైవేటు కార్యక్రమం బయట స్థానిక అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేసిందని, లోపల మాత్రం నిర్వాహకులే ఏర్పాట్లు చేసుకున్నారని జిల్లా మెజిస్ట్రేట్ ఆశిశ్ కుమార్ తెలిపారు. Aligarh Bhole Baba Hathras Stampede Leader of Opposition