Rajkot fire: గేమింగ్ జోన్ ప్రమాదంలో నలుగురు అధికారుల అరెస్ట్

గేమింగ్ జోన్‌లో అనేక లోపాలు

Update: 2024-05-31 01:15 GMT

గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్ అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసులో తాజాగా నలుగురు అధికారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. టౌన్‌ప్లాన్ ఆఫీసర్ మన్సుఖ్ సగతియా, అసిస్టెంట్ టౌన్ ప్లానర్ ముఖేష్ మక్వానా, అసిస్టెంట్ టౌన్ ప్లాన్ గౌతమ్ జోషి, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ రోహిత్ం విగోరా ఉన్నారు. గత శనివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారులు సహా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒక సహా యజమాని కూడా చనిపోయాడు. అధికారుల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. ఇక సస్పెండ్ అయిన అధికారుల ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు. గేమింగ్ జోన్‌లో అనేక లోపాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదం తర్వాత అప్పటి పోలీసు కమిషనర్ రాజు భార్గవతో సహా ముగ్గురు ఐపీఎస్ అధికారులు  కనబడకుండా వెళ్ళిపోయారు. 

ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) నేతృత్వం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సుభాష్ త్రివేది గురువారం గాంధీనగర్‌లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మాజీ అగ్నిమాపక అధికారి ఖేర్‌ను దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించినట్లు  సమాచారం. అయితే ఈ   గేమ్ జోన్  ఫైర్ NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) లేకుండా నడుస్తోందని ఖేర్ వెల్లడించాడు, ఎందుకంటే అసలు  మేనేజ్‌మెంట్ దాని కోసం ఎప్పుడూ దరఖాస్తు చేయనేలేదట.

మరోవైపు గుజరాత్ హైకోర్టు, గేమ్ జోన్ అగ్నిప్రమాదంపై, రాజ్‌కోట్ పౌర సంఘంపై తీవ్రంగా విరుచుకుపడింది, అమాయకుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత మాత్రమే చర్య తీసుకునే ప్రభుత్వ యంత్రాంగంపై తమకు విశ్వాసం లేదని పేర్కొంది. రాజ్‌కోట్‌ దుర్ఘటన మానవతప్పిదంగానే ప్రాథమికంగా కనిపిస్తోందని అభిప్రాయపడిన గుజరాత్‌ హైకోర్టు దీనిపై   సుమోటోగా విచారణ చేపట్టింది. గేమ్‌ జోన్లు, రిక్రియేషన్ క్లబ్‌లు అనుమతులు లేకుండానే నడుస్తున్నాయన్న హైకోర్టు అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్‌ నగరపాలక సంస్థల తరఫు న్యాయవాదులు   తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గేమ్‌ జోన్లు, క్లబ్‌ల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇస్తున్నారు, ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తున్నారో తమకు వివరించాలని స్పష్టం చేసింది. 

Tags:    

Similar News