SONIA: రాష్ట్రపతిపై సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు

సోనియా వ్యాఖ్యలు అగౌరవపరిచేలా ఉన్నాయన్న రాష్ట్రపతి భవన్... మండిపడిన మోదీ, బీజేపీ;

Update: 2025-02-01 01:00 GMT

కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ.. చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోయింది.. పాపం అంటూ వెటకారం ప్రదర్శించారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను మీడియా పలకరించింది. ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయారు అంటూ బదులిచ్చారు . లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ రాష్ట్రపతి ప్రసంగం వేరీ బోరింగ్..నో కామెంట్ అంటూ వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న ఎంపీ ప్రియాంక గాంధీ మాత్రం ఏమి మాట్లాడలేదు. అయితే రాష్ట్రపతి ముర్ము ప్రసంగం పట్ల సోనియా, రాహుల్ గాంధీలు చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకత్వం తప్పుబట్టింది.

బీజేపీ ఆగ్రహం

రాజ్యాంగ పదవిలో ఉండి..ఆదివాసీలను అవమానించడం కాంగ్రెస్ కు అలవాటేనని విమర్శించింది. బీజేపీ ఎంపీ సుకంతా మజుందార్ దీనిపై స్పందిస్తూ సోనియా, రాహుల్ గాంధీలు రాష్ట్రపతి ముర్ముపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారని.. కాంగ్రెస్ జమిందారీ మైండ్ సెట్ ఆ విషయాన్ని అంగీకరించలేక పోతుందని అందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని వారు వ్యతిరేకిస్తున్నారన్నారు.

సోనియా వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్రపతి భవన్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై కాంగ్రెస్ చేసిన విమర్శలపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. రాష్ట్రపతి గౌరవాన్ని తగ్గించేలా సోనియా వ్యాఖ్యలు ఉన్నాయని అభిప్రాయపడింది. ముర్ముపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని అంగీకరించలేమని రాష్ట్రపతి కార్యాలయం స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఏ సమయంలోనూ అలసిపోలేదని వెల్లడించింది. అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల గురించి మాట్లాడటంలో రాష్ట్రపతి అలసిపోబోరని తెలిపింది.

రాష్ట్రపతిని కాంగ్రెస్ అవమానించింది: మోదీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి సోనియాగాంధీ చేసిన "ఓల్డ్ పూర్ లేడీ" వ్యాఖ్యలపై ప్రధాని మోదీ భగ్గుమన్నారు. కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ రాష్ట్రపతిని అవమానించిందని మండిపడ్డారు. " ముర్ము గిరిజన కుటుంబం నుంచి వచ్చారు. ఈరోజు పార్లమెంటులో ఆమె అద్భుతంగా ప్రసంగించారు. కానీ కాంగ్రెస్ రాజకుటుంబం ఆమెను అవమానించింది. రాష్ట్రపతి బోరింగ్ ప్రసంగం చేశారని రాజ కుటుంబ సభ్యుడు ఒకరు విమర్శించారు" అని అన్నారు.

Tags:    

Similar News