Ratan Tata : ఈ సాయంత్రం 4 గంటలకు రతన్‌ టాటా అంత్యక్రియలు

ముంబై కి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా;

Update: 2024-10-10 04:45 GMT

 కొలాబాలోని రతన్‌ టాటా నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ముంబైలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లో పార్థివ దేహాన్ని ప్రముఖుల, ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహించనుంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం నేడు సంతాప దినంగా ప్రకటించింది.

ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తను టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ధ్రువీకరించారు. సోమవారం టాటా ఆస్పత్రికి వెళ్లడంతో.. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఐసీయూలో చేరారని వార్తలొచ్చాయి. వాటిపై స్పందించిన రతన్‌ టాటా.. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. రెండ్రోజులకే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

కాగా, రతన్‌ టాటా భౌతిక కాయాన్ని ప్రజత సందర్శనార్థం ముంబైలోని నారిమన్‌ పాయింట్లో ఉన్న నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (ఎన్‌సీసీఏ)లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంచుతారు. అనంతరం వర్లీ ప్రాంతంలో రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వ్యాపార దిగ్గజానికి కడసారి వీడ్కోలు పలికేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముంబై వెళ్లనున్నారు.

రతన్​ టాటా 1937 డిసెంబర్‌ 28న ముంబైలో నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించారు. 8వ తరగతి వరకు ముంబైలోని కాంపియన్‌ స్కూల్‌లో చదివారు. ఆ తర్వాత కేథడ్రల్‌ అండ్‌ జాన్‌ కానన్‌ పాఠశాలలో, శిమ్లాలోని బిషప్‌ కాటన్‌ స్కూల్‌లోనూ చదివారు.1955లో న్యూయార్క్‌లోని రివర్‌డేల్‌ కంట్రీ స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 1962లో కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్‌ డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ చేరి అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేశారు.

అదే ఏడాది టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్‌ సంస్థలో షాప్‌ ఫ్లోర్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు. 1977లో ఎంప్రెస్‌ మిల్స్‌కు మారారు. 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా ఉన్నారు. మళ్లీ అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించారు.

రతన్‌ టాటా సేవా గుణంలో అత్యున్నతుడు. 1970లలోనే సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆగాఖాన్‌ హాస్పిటల్‌, మెడికల్‌ కాలేజీని ప్రారంభించారు. ఆయన టాటా సన్స్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సేవా కార్యక్రమాలను మరింత విస్తరించారు. కరోనా మహమ్మారిపై పోరు కోసం రూ.1500 కోట్ల భూరి విరాళం ఇస్తున్నట్లు రతన్‌ టాటా ప్రకటించారు.

Tags:    

Similar News