Ratan Tata Love Story : విషాదాంతం రతన్ టాటా లవ్ స్టోరీ..
యుద్ధం విడదీసిన ప్రేమకథ;
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ఇకలేరు. ముంబైలో బుధవారం రాత్రి 11.30 గంటలకు బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. . ప్రపంచానికి వీడ్కోలు పలికిన రతన్ టాటా మాత్రం దేశప్రజల హృదయాల్లో ఎప్పుడూ రాజ్యమేలుతారు. అతను పెద్ద వ్యాపారవేత్త, వ్యాపారంతో పాటు దేశం పట్ల తన బాధ్యతలను కూడా చాలా చక్కగా నిర్వర్తించాడు. ఈ రోజు ప్రతి ఒక్కరూ అతని వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. తన జీవితాంతం అతను దేశం, ఇతరుల పురోగతి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. భారతదేశ ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా ఆయన ఆదర్శం. అతను తన తెలివితేటలతో టాటా గ్రూప్‌ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లాడు. నేటికీ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో కంపెనీలను కలిగి ఉన్న గ్రూప్‌గా టాటా నిలిచింది.
టాటా గ్రూప్ చాలా పెద్దది. ఇది ఉప్పు నుండి ఓడల వరకు ప్రతిదీ ఉత్పత్తి చేస్తుంది. రతన్ టాటా తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో కూడా సత్కరించారు. కానీ ఆయన ప్రేమకథ గురించి మీకు తెలుసా? ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పంచుకున్నారు. రతన్ టాటాకు అన్నీ ఉన్నాయి. కానీ అతనికి ఒక బాధ ఉంది. రతన్ టాటాకు వివాహం కాలేదు, కానీ అతనికి ప్రేమ కథ కూడా ఉంది. కానీ ఈ ప్రేమ అసంపూర్ణంగా మిగిలిపోయింది.
రతన్ టాటా 1937 డిసెంబర్ 28న జన్మించారు. రతన్ టాటాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. రతన్ అమ్మమ్మ ఆయనను పెంచి పెద్ద చేశారు. ప్రాథమిక విద్యను ముంబైలో పూర్తి చేయగా.. ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికాలోని ఆస్టిన్ విశ్వవిద్యాలయంలో చేరారు. ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. లాస్ ఏంజెల్స్‌లో ఓ ఉద్యోగంలో చేరారు. అక్కడ జాబ్ చేస్తున్న సమయంలోనే ఆయన ఓ యువతిలో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్దమయ్యారు. ఆమెను పెళ్లి చేసుకుని అమెరికాలోనే ఉండాలని భావించి అక్కడే జీవితాన్ని సెటిల్ చేసుకోవాలని రతన్ టాటా అనుకున్నారు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు రతన్ టాటా లవ్ స్టోరీలో ఈ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రతన్ టాటాను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మకు అనారోగ్యానికి గురైనట్లు భారత్ నుంచి కబురువచ్చింది. దీంతో ఆయన ఇక్కడికి వచ్చేశారు. రతన్ టాటా ఇక్కడ ఉన్న సమయంలోనే (1962లో ) భారత్-చైనా మధ్య భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధమే వారి ప్రేమకు విలన్‌గా మారింది. యుద్ధం భయంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెను భారత్‌కు పంపించేందుకు ఒప్పుకోలేదు. ప్రేమించిన అమ్మాయి దూరం కావటంతో ఇక తన జీవితంలో మళ్లీ ప్రేమకు గానీ, ఇంకో అమ్మాయికి గానీ, రతన్ టాటా చోటివ్వలేదు. తన లైఫ్ జర్నీలో పెళ్లి అనే బంధానికి స్వస్తి చెప్పి బ్యాచిలర్‌గానే మిగిలిపోయారు.