Rekha Gupta: భారత్ కంటే పాకిస్థానే ప్రేమిస్తారు.. జయా బచ్చన్‌పై రేఖా గుప్తా ఆగ్రహం

ఆపరేషన్‌ సిందూర్‌పై వ్యాఖ్యలు..;

Update: 2025-08-05 02:30 GMT

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ వర్సెస్ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కౌంటర్‌కు ప్రతికౌంటర్‌తో వాగ్యుద్ధం సాగుతోంది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ నడిచింది. ఈ సందర్భంగా రాజ్యసభలో జయా బచ్చన్ మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌కు సిందూర్ అని పేరు పెట్టడాన్ని జయా బచ్చన్ తీవ్రంగా తప్పుపట్టారు. మహిళలు సిందూరాన్ని కోల్పోయి బాధలో ఉంటే.. ఆపరేషన్‌కు సిందూర్ అని పేరు పెట్టడమేంటి? అని నిలదీశారు.

తాజాగా జయా బచ్చన్ రాజ్యసభలో మాట్లాడిన మాటలకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తున్నాయని.. దేశాన్ని ప్రేమించడం కంటే పాకిస్థాన్‌ను ప్రేమిస్తున్నారంటూ ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించారు.

సోమవారం ఢిల్లీ శాసనసభలో ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహాదేవ్‌పై జరిగిన చర్చ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ.. జయా బచ్చన్‌పై విరుచుకుపడ్డారు. ఆపరేషన్‌కు సిందూర్ అని ఎందుకు పేరు పెట్టారని అడిగారని.. ఆమెకు ఒక ఫిల్మీ డైలాగ్‌తో సమాధానం ఇస్తానన్నారు. ‘‘ఏక్ చుట్కీ సిందూర్‌కి కిమత్ ఆప్ క్యా జానో జయ మేడమ్? ఆప్‌తో ఫిల్మోంకి దున్యా జాంతి హై, దేశ్ కి సచ్చాయ్ నహీ’’ (చిటికెడు సిరప్ విలువ మీకు తెలియదు జయ మేడమ్. మీకు సినిమాల గురించి తెలుసు, దేశ వాస్తవికత గురించి కాదు.)’’ అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు భారత్‌ను ప్రేమించరని.. దేశ వ్యతిరేక శక్తులను ప్రేమిస్తారన్నారు. ఎందుకంటే వారు వారిలో తమ ప్రతిబింబాన్ని చూస్తారన్నారు. కాకపోతే పైకి భారతీయులం అని చెబుతారు కానీ.. మాట్లాడేటప్పుడు పాకిస్థాన్ ప్రతినిధులుగానే మాట్లాడతారని పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచమంతా మెచ్చుకుంటే.. ప్రతిపక్ష నేతలు మాత్రం మోడీ విశ్వసనీయతను ప్రశ్నించారన్నారు. మన సైన్యాన్ని, మన ప్రధానమంత్రిని మాత్రం విపక్షాలు నమ్మవని ధ్వజమెత్తారు. పహల్గామ్ ఉగ్రదాడికి బదులు ప్రధాని మోడీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను రేఖా గుప్తా ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్‌తో తగిన బుద్ధి చెప్పినట్లు పేర్కొన్నారు. మన సోదరీమణుల గౌరవాన్ని ప్రధాని మోడీ కాపాడారన్నారు.

Tags:    

Similar News